IND vs NZ 3rd Test 2024 : సొంత గడ్డపై టీమ్ఇండియా ఘోర పరాభవం మూటగట్టుకుంది. న్యూజిలాండ్‌తో మూడో టెస్టులోనూ ఓడి, స్వదేశంలో టెస్టుల్లో తొలిసారి వైట్‌వాష్‌కు గురైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 121 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్ (64 పరుగులు) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో భారత్ 25 పరుగుల తేడాతో ఓడింది. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ 6, గ్లెన్ ఫిలిప్ 3, మ్యాట్ హెన్రీ 1 వికెట్ పడగొట్టారు. కాగా, తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన కివీస్ తాజా విజయంతో 3-0తో ఈ సిరీస్ దక్కించుకుంది.
లక్ష్యం చిన్నదే అయినప్పటికీ పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించడం వల్ల పరుగులు రావడం కష్టమైంది. ఇన్నింగ్స్ ప్రారంభంలో కెప్టెన్ రోహిత్ శర్మ (11 పరుగులు) రెండు ఫోర్లు బాది ఊపుమీద కనిపించాడు. ఇక బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే క్రమంలో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 13 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత శుభ్‌మన్ గిల్ (1) బంతిని అంచనా వేయడంలో విఫలమై క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కాసేపటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (1 పరుగు), యశస్వీ జెస్వాల్ (5), సర్ఫరాజ్ ఖాన్ (1) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో భారత్ 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.