IND vs NZ 3rd Test 2024 :భారత్- న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముంబయి వేదిక కానుంది. మూడు టెస్టుల సిరీస్‌లో 2- 0తో ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్ చివరి టెస్టులోనూ నెగ్గి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు బ్యాటింగ్ వైఫల్యాలతో 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ కోల్పోయిన టీమ్ఇండియా చివరి టెస్టులోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. నెట్స్‌లో భారత బ్యాటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మూడో టెస్టులోనైనా?
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఫేవరెట్‌గా అడుగు పెట్టి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అనూహ్య పరాభవాలు ఎదుర్కొన్న టీమ్‌ఇండియాకు ఇప్పుడు చివరిదైన మూడో టెస్టులో పరువు కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. మూడో టెస్టులో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో రోహిత్‌సేన ముమ్మరంగా సాధన చేసింది. పన్నెండేళ్లుగా సొంతగడ్డపై సిరీసే కోల్పోని టీమ్‌ఇండియా రికార్డుకు కివీస్ గండికొట్టింది. సిరీస్‌లో వైఫల్యంతో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్‌పై కూడా తీవ్ర ఒత్తిడి ఉంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పట్టికలో టీమ్ఇండియా ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ మూడో టెస్టులోనూ ఓడితే ఫైనల్ బెర్తు సాధించే అవకాశాలు ప్రమాదంలో పడతాయి. రాబోయే ఆస్ట్రేలియా పర్యటనకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవ్వాలన్నా, డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం కాకూడదన్నా భారత జట్టు ముంబయిలో గెలిచి తీరాల్సిందే. WTC ఫైనల్‌కు ముందు ఆరుటెస్టులు ఆడనున్న భారత్ అందులో నాలుగు టెస్టుల్లో నెగ్గాల్సి ఉంది.
రోహిత్, విరాట్‌పైనే కన్ను
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో బ్యాటింగ్‌లో టీమ్ఇండియా ప్రదర్శన పేలవంగా ఉంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కోహ్లి సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరిచారు. రోహిత్ వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 2, 52, 0, 8 పరుగులు చేస్తే, విరాట్ 0, 70, 1, 17 స్కోర్లకు పరిమితమయ్యాడు. వీళ్లిద్దరినీ జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు కూడా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లీ తమ స్థాయికి తగ్గ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఫామ్‌లో ఉండడం టీమ్‌ఇండియాకు శుభ పరిణామం. శుభ్‌మన్ గిల్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరముంది. పంత్, సర్ఫరాజ్ బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చూపించిన పోరాటపటిమను మూడో టెస్టులో కొనసాగించాలి.