IND vs NZ 3rd Test 2024 :భారత్- న్యూజిలాండ్ మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో కివీస్ 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. క్రీజులో అజాజ్ పటేల్ (7 పరుగులు) ఉన్నాడు. దీంతో కివీస్ ప్రస్తుతం 143 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, రవిచంద్రన్ అశ్విన్ 3, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.
28 పరుగుల వెనుకంజతో కివీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. తొలి ఓవర్లోనే టామ్ లేథమ్ (1 పరుగు)ను ఆకాశ్ దీప్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత పిచ్ నెమ్మదిగా స్పిన్నర్లకు సహకరించింది. దీంతో సీనియర్ ప్లేయర్ జడేజా, అశ్విన్ చెలరేగిపోయారు. వీళ్ల దెబ్బకు కివీస్ బ్యాటింగ్ కుదేలైంది. డేవన్ కాన్వే (22 పరుగులు), రచిన్ రవీంద్ర (4 పరుగులు), డారిల్ మిచెల్ (21 పరుగులు), టామ్ బ్లండెల్ (4 పరుగులు), గ్లెన్ ఫిలిప్ (26 పరుగులు) ఇష్ సొథి (8 పరుగులు), మ్యాట్ హెన్రీ (10 పరుగులు) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 86- 4తో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన టీమ్ఇండియా 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (90 పరుగులు), రిషభ్ పంత్ (60 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. వాషింగ్టన్ సుందర్ (38* పరుగులు) ఆకట్టుకున్నాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 28 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. ఇక కివీస్ రెండో ఇన్నింగ్స్ దాదాపు ముగిసిట్లే! దీంతో మూడో రోజే మ్యాచ్ ముగిసే ఛాన్స్ ఉంది.