TeamIndia Highest Run Chase in 4th Innings Test :టెస్టు క్రికెట్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం బ్యాటర్లకు కాస్త కష్టమే! అయినప్పటికీ టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొన్ని భారీ ఛేజింగ్‌లు నమోదు అయ్యాయి. టీమ్ ఇండియా కూడా నాలుగో ఇన్నింగ్స్‌లో ఈ భారీ లక్ష్యాల్ని ఛేదించిన సందర్భాలు ఉన్నాయి.
ప్రస్తుతం పుణె వేదికగా జరుగుతోన్న టెస్ట్‌లోనూ ఇలాంటి సీన్ రిపీట్ కావాలని భారత క్రికెట్ అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే, ప్రస్తుతం జరుగుతోన్న ఈ రెండో టెస్ట్‌లో భారత్ ఓడిపోతే, సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ పోరులో భారత్ లక్ష్యం 359.
ఈ నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్‌లో భారత జట్టు చేసిన మూడు భారీ ఛేజింగ్‌ల గురించి తెలుసుకుందాం.
నాలుగో ఇన్నింగ్స్‌లో 300కుపైగా లక్ష్యాన్ని భారత్ ఛేజ్ చేసింది మూడు సార్లే. అందులో ఒకటి స్వదేశంలో చేయగా రెండు సార్లు విదేశీ గడ్డపై చేసింది.
1. 403 పరుగులు వర్సెస్ వెస్టిండీస్ (పోర్ట్ ఆఫ్ స్పెయిన్, 1976) - టెస్ట్ క్రికెట్‌లో టీమ్ ఇండియా అతి పెద్ద ఛేజింగ్ 403 పరుగులు. 1976లో విండీస్‌పై జరిగిన అతిపెద్ద పరుగుల వేటగా ఇదే. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన ఈ మూడో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ భారత్‌కు 403 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అప్పుడు గుండప్ప విశ్వనాథ్ 112 పరుగులు, సునీల్ గవాస్కర్ 102 పరుగుల సాయంతో టీమ్ ఇండియా ఈ లక్ష్యాన్ని అందుకుని సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 359 పరుగులు చేయగా, టీమ్ ఇండియా 228 పరుగులు మాత్రమే చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కరీబియన్ జట్టు 6 వికెట్లకు 271 పరుగుల స్కోరు దగ్గర డిక్లేర్ చేయగా, భారత్ ముందు 403 పరుగుల లక్ష్యం నిలిచింది.
2. 387 పరుగులు వర్సెస్ ఇంగ్లాండ్ (చెన్నై, 2008) - 2008లో ఇంగ్లాండ్‌పై 387 పరుగుల లక్ష్యాన్ని సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది భారత్. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులు చేయగా, భారత్ 241 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 9 వికెట్లకు 311 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ముందు 387 పరుగుల లక్ష్యం నిలిచింది. అప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ 68 బంతుల్లో 82 పరుగులు, సచిన్ తెందూల్కర్ 103 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించారు. టీమ్ ఇండియా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
3. 328 పరుగులు వర్సెస్ ఆస్ట్రేలియా ( బ్రిస్బేన్, 2021) - గబ్బాలో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా సాధించిన విజయాన్ని క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. 2021 ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో మనోళ్లు 328 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించారు. ఈ మ్యాచ్ హీరో రిషబ్ పంత్. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేయగా, భారత్ 336 పరుగులు చేసింది. మూడో ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టు 294 పరుగులు చేయడంతో భారత్ ముందు 328 పరుగుల లక్ష్యం నిలిచింది. శుభ్‌మన్ గిల్ 91, రిషబ్ పంత్ 89* పరుగుల సాధించడంతో 7 వికెట్లకు 329 పరుగులు చేసి మ్యాచ్‌లో విజయాన్ని సాధించింది టీమ్ ఇండియా.
స్వదేశంలో నాలుగో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా ఛేజ్ చేసిన పెద్ద లక్ష్యాలు ఇవే
- 387/4 vs ఇంగ్లాండ్ (చెన్నై, 2008)
- 276/5 vs వెస్టిండీస్ ( దిల్లీ, 2011)
- 262/5 vs న్యూజిలాండ్ ( బెంగళూరు, 2012)
- 256/8 vs ఆస్ట్రేలియా (బ్రాబోర్న్, ముంబయి, 1964)
- 216/9 vs ఆస్ట్రేలియా (మోహలి, 2010)
టీమ్ఇండియా టెస్ట్ బ్యాటింగ్ రివ్యూ - అలా చేయకపోతే బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భారత్ బోల్తానే?
'జస్టిస్ ఫర్ రుతురాజ్ గైక్వాడ్ - CSKతో ఉండటమే అతడి తప్పా?'