December 31 Special Pooja for Good Luck: మరికొన్ని రోజుల్లో 2024కు ముగింపు పలికి.. కొత్త సంవత్సరాని(2025)కి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే.. కొత్త సంవత్సరంలో తమ జాతకం ఎలా ఉండనుందో అని ఆలోచించేవారు చాలా మందే ఉంటారు. అలాంటివారు అదృష్టం, ఐశ్వర్యం అందిపుచ్చుకోవాలంటే డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు ఓ పూజ చేయాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
డిసెంబర్ 31 మంగళవారం వచ్చింది. ఈరోజున అర్ధరాత్రి 12 గంటలకు పూజగదిలో ప్రత్యేకమైన విధివిధానాలు పాటించడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుందని.. 2025వ సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. దాంతోపాటు మంగళవారం ఉదయం కూడా కొన్ని పరిహారాలు చేయాలని చెబుతున్నారు. అవేంటంటే..
డిసెంబర్ 31 మంగళవారం పాటించాల్సిన విధివిధానాలు:
- ముందుగా తెల్లవారుజామున నిద్ర లేచి ఇళ్లు శుభ్రం చేసి తలంటు స్నానం చేయాలి. అయితే స్నానం చేసే నీటిలో నల్లనువ్వులు, ఉసిరిక పొడి కలిపి 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే రాబోయే సంవత్సరంలో కుజుడి అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు.
- అనంతరం పూజ గదిలో దక్షిణ దిక్కులో పీట ఏర్పాటు చేసి దాని మీద బియ్యప్పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి.. ఆ ముగ్గు మధ్యలో ఎర్ర చందనంతో హ్రుమ్ అనే అక్షరం రాసి దాని మీద మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి తొమ్మిది వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి అది దక్షిణ దిక్కు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి.
- అలాగే మంగళవారం రోజున నానబెట్టిన కందులు, బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలని, ఒకటింపావు కేజీ కందులు ఎర్రని వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలని చెబుతున్నారు.
డిసెంబర్ 31 అర్ధరాత్రి చేయాల్సిన పూజ: ఆంగ్ల సంవత్సరం మొత్తం అదృష్టం, ఐశ్వర్యం కలిసి రావాలంటే సరిగ్గా 31వ తేదీ అర్ధరాత్రి పూజగదిలో దీపం వెలిగించాలని చెబుతున్నారు. అది ఎలాగంటే..
- పూజ గదిలో అష్ట లక్ష్మీ/గజ లక్ష్మీ/ కుడి చేత్తో బంగారు నాణెలు వర్షిస్తున్న చిత్రపటం. ఈ మూడింటిలో ఏదైనా ఒక ఫొటోను పూజగదిలో ఏర్పాటు చేసుకోవాలి.
- ఆ తర్వాత గులాబీ పూలను అలంకరించాలి.
- ప్రమిదలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, విప్ప నూనె, మల్లె నూనె, సంపెంగ నూనె, కొబ్బరి నూనె వీటన్నింటిని కలిపి దీపం వెలిగించాలని అంటున్నారు. వీటిలో ఏది లేకపోయినా మీకు ఉన్నవాటితోనే దీపం వెలిగించుకోవచ్చని వివరిస్తున్నారు.
- వీటన్నింటిని కలిపి వెలిగిస్తే 2025 సంవత్సరం అంతా కుబేరుడు, లక్ష్మీ దేవి, గణపతి అనుగ్రహంతో అదృష్టం, ఐశ్వర్యం, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు.
- పురుషులు విమల మంత్రం అంటే "లక్ష్మీ కమలవాసిన్యై నమః", స్త్రీలు "ఓం శ్రీం శ్రీ నమః" అనే మంత్రాలను వీలైనన్ని సార్లు అంటే 108 లేదా 54 లేదా 21 సార్లు చదవాలంటున్నారు.
- దీపం వెలిగించిన తర్వాత మంచి సువాసన కలిగిన అగరబత్తీలను వెలిగించాలి.
- ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీంతో పూజ పూర్తవుతుంది.
- ఒకవేళ ఆ సమయంలో వీలు కలిగిన వారు కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం చదవడం లేదా వినడం చేస్తే మరీ మంచిదంటున్నారు. ఇవన్నీ చేయలేకపోయినా లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నా మంచిదంటున్నారు.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఏలినాటి శనితో ఇబ్బంది పడుతున్నారా? ఈ పరిహారాలు పాటిస్తే దోషాల నుంచి ఉపశమనం!
'రావి ఆకుపై ఇలా రాసి పెడితే అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతాయి'