Kothakota Kebab : అగ్గిపెట్టెలో పట్టేంత చీరను నేసి రాష్ట్రపతి నుంచి పురస్కారం అందుకున్న కొత్తకోట చేనేత కార్మికుల కథ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ చేనేత చీరలే కాదు, కాల్చిన మాంసానికీ ప్రసిద్ధి అని మీలో ఎంత మందికి తెలుసు? ఈ కొత్తకోట కబాబ్ ఎంతో రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్లీ ఇంకోసారి తినాలని అనిపిస్తుంది. అలా ఉంటుంది కొత్తకోట కబాబ్ చికెన్ టేస్ట్. కొత్తకోట కబాబ్ అంటూ హైదరాబాద్ వంటి పెద్ద పట్టణాల్లో బోర్డులు పెట్టి మరీ లక్షల వ్యాపారం చేసే స్థాయికి చేరుకుందంటే దాని టేస్ట్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఒకప్పుడు ఏడాదికోసారి మాత్రమే వచ్చే శ్రీ కురుమూర్తి స్వామి జాతరలో మాత్రమే దొరికే కాల్చిన మాంసం, ఇప్పుడు ఈ కొత్తకోటలో 365 రోజులూ దొరుకుతుంది. నోరూరించే రుచితో పాటు ఇక్కడి వ్యాపారులు మాంసం ప్రియులను ఎంతో ఆకట్టుకుంటున్నారు. బొగ్గులపై మాంసాన్ని కాల్చుతూ ఉంటే నోట్లో లాలాజలం ఊరిపోతుంది. వీరు పెట్టే మసాలా ముద్దనే మాంసం ముక్కకు రుచిని అందిస్తుంది.
ఆరేళ్ల క్రితం రెండే దుకాణాలతో ప్రారంభం : కురుమూర్తి జాతరకు వెళ్లే భక్తుల్లో 60 శాతం మంది స్వామిని దర్శించుకున్న అనంతరం కాల్చిన మాంసం ముక్కను తినాల్సిందే. ఇది ఇక్కడి అలవాటుగా వస్తోంది. అక్కడి విక్రయాలను చూసిన కొత్తకోటకు చెందిన ఇద్దరు వ్యాపారులు రెండు దుకాణాలను ఏర్పాటు చేసి, నిత్యం అందుబాటులోకి వచ్చే విధంగా చేశారు. దీంతో కాల్చిన మాంసానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇక్కడికి కర్నూల్, వనపర్తి, పెబ్బేరు తదితర ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తుంటారు.
ఇలా కాల్చిన మాంసాన్ని కొనుగోలుదారులు విపరీతంగా కొనడంతో వ్యాపారం విస్తరించింది. మాంసం విక్రదారులు ఒక్కొక్కరుగా కాల్చిన మాంసం విక్రయ దుకాణాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ 30కి పైగా దుకాణాల్లో కేవలం కబాబ్ మాత్రమే విక్రయిస్తున్నారు. 100కి పైగా కుటుంబాలు వీటిపై ఆధారపడి జీవిస్తున్నాయి.
అసలు రహస్యం అదే : కొత్తకోట కబాబ్ చికెన్ సీకులు అంతలా ప్రాచుర్యం పొందడానికి ఏం ప్రత్యేకత ఉందని ఆరా తీస్తే, మాంసంతో కలిపే మసాలాల కలయిక అనే చెబుతున్నారు. ధనియాల పొడి, మిర్చిపొడి, అల్లంవెల్లుల్లి మిశ్రమాన్ని నూనెతో మాంసానికి బాగా పట్టిస్తారు. ఆ తర్వాత కాసేపు అలానే ఉంచుతారు. కొనుగోలుదారులను ఊరిస్తూ సీకులకు కుచ్చి నిప్పులపై వాటిని కాలుస్తారు. కాల్చినప్పుడు వచ్చే వాసన మాంసం ప్రియులను ఊరిస్తుంటుందనే చెప్పాలి. లేత మాంసం కోసం వ్యాపారులు 8 కిలోల లోపు బరువున్న జీవాలను వధిస్తుంటారు.
రోజూ రూ.5 లక్షల వ్యాపారం జరుగుతుంది : కొత్తకోట పట్టణంలోని పాలెం రోడ్డులో రోజూ వ్యాపారులు 5 క్వింటాళ్లకు పైగా మాంసం అమ్ముతారు. అలాగే మరో 200 కిలోల చికెన్ కబాబ్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా కిలో మాంసం ధర రూ.800 కానీ కబాబ్ లెక్కన విక్రయిస్తే (వీటిలో మాంసం తూకం మసాలాలతో కలిపి) కిలో రూ.900 తీసుకుంటారు. అలాగే చికెన్ కబాబ్ కిలో రూ.400లకు అమ్ముతుంటారు. ఈ లెక్కన చూస్తే రోజుకు రూ.5 లక్షలు పైగా వ్యాపారం జరుగుతుందని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి రాయలసీమ వెళ్లే వారు, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లే వారు స్థానిక వ్యాపారులకు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకుంటున్నారు.
Chettinad Chicken Recipe : సండే స్పెషల్.. నోరూరించే చెట్టినాడ్ చికెన్