Ind vs Eng 5th Test 2024:ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో దూకుడు మీదున్న ఉన్న టీమ్ఇండియా ఆఖరి మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ చివరి టెస్టులోనూ విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని భావిస్తోంది. ఈ టెస్టు మ్యాచ్‌లో ఓడిపోతే WTC పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ధర్మశాల పిచ్ మొదట సీమర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్ది స్పిన్నర్ల ప్రభావం కనిపిస్తుంది.
ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి వందో టెస్టు ఆడుతున్న వెటరన్ స్పిన్నర్ ఆర్. అశ్విన్‌పై నెలకొంది. దశాబ్దకాలంగా జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న అశ్విన్ కెరీర్‌లో మైలురాయి అయిన వందో టెస్టులో రాణించాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో అదరగొడుతున్న జైస్వాల్‌తో ఎప్పటిలాగే రోహిత్ ఓపెనింగ్ చేస్తాడు. శుభమన్ గిల్, సర్ఫారాజ‌్ ఖాన్ తుది జట్టులో ఉండనున్నారు. ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమైన రజత్ పటీదార్ స్థానంలో మరో యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ టెస్టు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
వికెట్ కీపర్ బ్యాటర్‌గా నాలుగో టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధ్రువ్ జురెల్ మరోసారి చెలరేగాలని చూస్తున్నాడు. అశ్విన్, జడేజా ఆల్‌రౌండర్‌లుగా జట్టులో ఉండనున్నారు. నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నాడు. బుమ్రాను తుది జట్టులోకి తీసుకుంటే సిరాజ్ లేదా ఆకాశ్ దీప్‌లలో ఎవరిని పక్కనపెడతారో చూడాలి. ధర్మశాల పిచ్ పరిస్థితులను బట్టి ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే కులీదీప్ యాదవ్ బెంచ్‌కు పరిమితంకానున్నాడు.