Ind vs Eng 4Th Test 2024:భారత్- ఇంగ్లాండ్ మధ్య శుక్రవారం రాంచీ వేదికగా నాలుగో టెస్టు మొదలు కానుంది. తొలి టెస్టు పరాభవం తర్వాత గాడిలో పడ్డ భారత్ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. ఈ సిరీస్ గెలిస్తే స్వదేశంలో వరుసగా 17 టెస్టు సిరీస్ విజయాలు భారత్ ఖాతాలో చేరతాయి. స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేనప్పటికీ యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తుండటం భారత్‌కు సానుకూల అంశంగా మారింది.
మూడో టెస్టులో ద్విశతకంతో అదరగొట్టిన యశస్వీ జైశ్వాల్ ఈ మ్యాచ్‌లోనూ కెప్టెన్ రోహిత్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. వన్ డౌన్‌లో గిల్, తర్వాత రజత్ పటిదార్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. సీనియర్ ఆల్‌రౌండర్ జడేజా, అరంగేంట్ర టెస్టులోనే అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ మళ్లీ రాణించాలని జట్టు భావిస్తోంది. వర్క్‌లోడ్‌తో పాటు భవిష్యత్ మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని స్టార్ బౌలర్ బుమ్రాకు విశ్రాంతినివ్వడం వల్ల ఈ మ్యాచ్‌లో అతడి స్థానంలో ఎవరు ఆడతారనేది ఆసక్తిగా మారింది.
వైజాగ్ టెస్టులో ఆడిన ముకేశ్ కుమార్‌ను మళ్లీ తీసుకుంటారా లేదా అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న ఆకాశ్ దీప్‌ను ఆడిస్తారా అనేది ఆసక్తి కలిగిస్తోంది. బుమ్రా గైర్హాజరీలో జడేజా, అశ్విన్, కుల్దీప్‌లతో కూడిన బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ ముందుండి నడపనున్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో నాలుగో స్పిన్నర్‌తో బరిలోకి దిగితే అక్షర్ పటేల్, సుందర్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది. ఝార్ఖండ్‌లో గతంలో జరిగిన మ్యాచ్‌ల్లో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో కూడిన కూర్పు మంచి ఫలితాలు ఇవ్వడం వల్ల భారత్ అదే తరహా జట్టును కొనసాగించేలా కనిపిస్తోంది.