తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్లీన్​స్వీప్​పై టీమ్ఇండియా గురి! - మూడో వన్డేలో ఆ స్టార్ పేసర్ రీ ఎంట్రీ! - IND VS ENG 3RD ONE DAY

భారత్​ x ఇంగ్లాండ్ మూడో టీ20 - తుది జట్టులో 4 మార్పులకు ఛాన్స్!

IND VS ENG 3RD ONEDAY
IND VS ENG 3RD ONEDAY (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Feb 11, 2025, 7:05 PM IST

IND VS ENG 3RD ODI : ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 4-1తో జయభేరి మోగించిన టీమ్ఇండియా మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంపై కన్నేసింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదున్న భారత జట్టు మూడో వన్డేలోనూ గెలుపొంది ఈ నెల 19 నుంచి ఆరంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని భావిస్తోంది.

అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం టీమ్ఇండియా తుది జట్టులో పలు మార్పులు చేసి బెంచ్‌ బలాన్ని పరీక్షించాలనుకుంటోంది. సిరీస్‌లో ఇప్పటివరకు ఆడని వికెట్‌ కీపర్ రిషభ్ పంత్ , ఫాస్ట్‌ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌లకు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి.

తొలివన్డేలో ఆడిన మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ అహ్మదాబాద్‌లో ఆడే అవకాశాలున్నాయి. వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ స్థానాన్ని పంత్, షమి ప్లేస్‌ని అర్ష్‌దీప్ భర్తీ చేసే ఛాన్స్‌ ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో రాణించిన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇచ్చి వారి స్థానంలో కుల్‌దీప్, వాషింగ్టన్‌ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది. నాగ్‌పుర్‌లో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లోకి అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ మూడో వన్డేలో బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది.

కటక్‌ వన్డేతో స్టార్ బ్యాటర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం. 90 బంతుల్లోనే రోహిత్‌ 119 పరుగుల చేశాడు. మరో 13 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 11 వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్‌ శర్మ రికార్డు సృష్టిస్తాడు. సచిన్, రికీ పాంటింగ్, సౌరభ్ గంగూలీ, జాక్వెస్ కలిస్ వంటి దిగ్గజాల కంటే వేగంగా 11 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ నిలుస్తాడు. ఈ అరుదైన జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు రోహిత్ 259 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల 987 పరుగులు చేశాడు.

గత కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమౌతున్న విరాట్ కోహ్లీ కూడా అహ్మదాబాద్‌ వన్డేతో ఫామ్‌ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయికి కోహ్లీ 89 పరుగుల దూరంలో ఉన్నాడు. మరోవైపు చివరి మ్యాచ్‌లోనైనా నెగ్గి ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని ఇంగ్లాండ్‌ జట్టు భావిస్తోంది.

నరేంద్రమోదీ స్టేడియంలో భారత్ చివరి వన్డే మ్యాచ్‌ 2023 నవంబర్‌ 19న ఆడింది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలై మూడోసారి విశ్వవిజేతగా నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు మ్యాచ్‌ ఆరంభం కానుంది.

మరో మైల్​స్టోన్​కు దగ్గరలో రోహిత్​- ఒకే దెబ్బతో నలుగురి రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్​!

ఎయిర్​పోర్ట్​లో 'లక్కీ లేడీ'! - విరాట్​ వెళ్లి మరీ ఆమెకు హగ్​ ఇచ్చాడుగా!

ABOUT THE AUTHOR

...view details