Ind vs Eng 1st Test Preview:సొంత గడ్డపై టెస్టు సిరీసుల్లో 12 ఏళ్లుగా ఓటమి ఎరుగని భారత్ జట్టుకు సిసలైన పరీక్ష ఎదురుకానుంది. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలిమ్యాచ్ గురువారం హైదరాబాద్ వేదికగా మొదలుకానుంది. బజ్‌బాల్ ఆటతీరుతో సుదీర్ఘ ఫార్మాట్‌లో వేగాన్ని పెంచిన ఇంగ్లాండ్ దశాబ్దకాలానికిపైగా సొంతగడ్డపై తిరుగులేని టీమిండియాకు సవాలు విసరనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.
భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. హైదరాబాద్ ఉప్పల్ వేదికగా గురువారం ఇరుజట్ల మధ్య తొలిటెస్టు ఆరంభం కానుంది. విజయంతో సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. సొంతగడ్డపై భారత్ టెస్టు సిరీస్ ఓడి దాదాపు 11 ఏళ్లు గడిచిపోయాయి. చివరగా 2012లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-2తో భారత్ కోల్పోయింది.
అప్పటి నుంచి సొంతగడ్డపై భారత్ మరో టెస్టు సిరీస్ ఓడిపోలేదు. కనీసం ప్రత్యర్థికి సిరీస్ డ్రా చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. తొలి టెస్టు జరిగే ఉప్పల్ పిచ్ స్పిన్‌కు సహకరించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లే సంపూర్ణ ఆధిపత్యం చలాయించే ఛాన్స్ ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్ టీమ్‌ఇండియాకు ఎంతో కీలకం. దీంతో ఇప్పుడు అందరిదృష్టి ఈ సిరీస్‌పై పడింది.