IND VS BAN Second Test Mominul Haque Pant :టీమ్ఇండియా - బంగ్లాదేశ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన చర్యలతో నవ్వించాడు. వికెట్ల వెనుకాల నుంచి ప్రత్యర్థి బ్యాటర్లపై సెటైర్లు వేశాడు. పంత్ వేసిన జోక్స్‌కు కామెంట్రీ బాక్స్‌లో ఉన్న దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ నవ్వు ఆపుకోలేకపోయాడు.
అసలేం జరిగిందంటే? -ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్‌కు దిగింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేసింది. అయితే ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు పోగొట్టుకుంది ఆ జట్టు. క్రీజులోకి వచ్చిన మోమినల్ హక్ అశ్విన్ వేసిన 33వ ఓవర్‌లో స్వీప్ షాట్ ఆడబోయి విఫలమయ్యాడు. బంతి హక్ ప్యాడ్లను తాకడంతో రిషభ్ పంత్ అప్పీల్ చేయగా, అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో పంత్ రివ్యూ తీసుకోవాలని సూచించాడు. అయితే అశ్విన్ బంతి మోమినల్ హక్ బ్యాట్ తాకిందని చెప్పాడు. రిప్లేలోనూ అదే విషయం క్లారిటీ అయింది.
అనంతరం క్రీజులో వెనకాల ఉన్న పంత్, మోమినల్ హక్ ఎత్తును ఉద్దేశించి సెటైర్లు వేశాడు. 'మోమినల్ హక్ హెల్మెట్‌కు బంతి తాకినా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయాలి' అని గట్టిగా అన్నాడు. ఈ వ్యాఖ్యలతో పక్కనే ఉన్న ప్లేయర్స్ నవ్వుకున్నారు. అయితే మోమినుల్ హక్ 5 అడుగుల 3 అంగులాల ఎత్తు మాత్రమే ఉంటాడు. ఇదే సమయంలో పంత్ అన్న మాటలను దిగ్గజ క్రికెటర్ గవాస్కర్ కూడా ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేషన్ చేసి తెగ నవ్వాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. దీంతో ఒక పొట్టోడి గురించి మరో పోట్టోడు మాట్లాడలని పంత్ ఎత్తును ఉద్దేశించి నెటిజన్లు సైటైర్లు పేల్చారు.