IND VS BAN History Of Lunch Break In Test Cricket :క్రికెట్లో టెస్టులను సుదీర్ఘమైన ఫార్మాట్‌గా అభివర్ణిస్తారు. ఎందుకంటే ఈ ఫార్మాట్లో ఫలితం తేలడానికి ఐదు రోజుల సమయం పడుతుంది. ప్రతి రోజు టెస్టులో మొత్తం మూడు సెషన్లు ఉంటాయి. టెస్టుల్లో రోజు మొత్తం ఆడాల్సి ఉంటుంది కాబట్టి ఆటగాళ్లకు నిర్దిష్ట వ్యవధిలో తగినంత విశ్రాంతి లభించే విధంగా ఈ సెషన్లను విభజించారు. అవే లంచ్, టీ బ్రేక్. మరి క్రికెటర్లు లంచ్ బ్రేకులో ఏం తింటారు? ఎన్ని నిమిషాల విరామం ఉంటుంది? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
40 నిమిషాల బ్రేక్ - ఐదు రోజుల టెస్టు మ్యాచులో ప్రతి రోజూ ఆట ప్రారంభమైన రెండు గంటల ఆట తర్వాత తొలి సెషన్ ముగుస్తుంది. అప్పుడు ప్లేయర్స్ లంచ్ బ్రేక్ తీసుకుంటారు. ఈ లంచ్ బ్రేక్ 40 నిమిషాల పాటు ఉంటుంది. క్రీజులో అటుఇటూ పరుగెత్తే బ్యాటర్‌కైనా, బౌలర్లు, ఫీల్డర్లకైనా కాస్త శరీరం రీఛార్జ్ కావడానికి ఈ లంచ్ బ్రేక్ బాగా పనికొస్తుంది.
లంచ్ బ్రేక్ చరిత్ర - 19వ శతాబ్దం ప్రారంభంలో క్రికెట్‌ను ఇంగ్లాండ్ జట్టు శాసించేంది. ఈ క్రమంలో ఈ క్రీడకు సంబంధించిన అన్ని నిబంధనలను మేర్లీబోన్ క్రికెట్ క్లబ్ రూపొందించింది. లంచ్, టీ బ్రేక్‌ను టెస్టు క్రికెట్లో ఇంగ్లీష్ జట్టే ప్రవేశపెట్టింది. తొలుత ఈ గేమ్‌ను పెద్ద మనుషులు ఆడే ఆటగా అభివర్ణించేవారు. భారత్‌లో అయితే రాజకుటుంబీకులు మాత్రమే క్రికెట్‌ను ఆడేవారు.
లంచ్ బ్రేక్‌లో ఏం తింటారు? - ప్రతి రోజు టెస్టు మ్యాచ్ ప్రారంభమైన రెండు గంటల తర్వాత 40 నిమిషాల లంచ్ బ్రేక్ ఉంటుంది. ఈ విరామంలో ఇరు జట్లు డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకుంటాయి. 1990వ దశకంలో క్రికెటర్లు శాండ్ విచ్లు, పోర్క్స్ , మరిన్ని ఇతర రుచికరమైన ఆహార పదార్థాలను లంచ్ బ్రేక్‌లో తినేవారు. ప్రస్తుతం కాలం మారింది. ఆటగాళ్లు ఫిట్ నెస్ పై దృష్టి పెట్టారు. అందుకే ప్రతి టీమ్‌కు పోషకాహార నిపుణుడు తోడుగా ఉంటున్నాడు. అతడు లంచ్ మెనూను రూపొందిస్తాడు. ప్లేయర్లు కూడా అదే ఆరోగ్యకరమైన ఆహారాన్ని లంచ్ బ్రేక్‌లో ఆరగిస్తారు.