Ind vs Aus 4th Test 2024 :బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కింది. టాపార్డర్ బ్యాటర్లు చెలరేగారు. టాప్ - 4 బ్యాటర్లు హాఫ్ సెంచరీలు సాధించారు. తొలి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 86 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్టీవ్ స్మిత్ (68 పరుగులు), ప్యాట్ కమిన్స్ (8 పరుగులు) ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో రాణించాడు. ఆకాశ్ దీప్, సుందర్, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఆసీస్ దూకుడు
టాస్ నెగ్గిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి నుంచే దూకుడుగా ఆడింది. ఓపెరన్లు సామ్ కాన్‌స్టాస్ (60 పరుగులు), ఉస్మాన్ ఖవాజా (57 పరుగులు) తొలి వికెట్‌కు 89 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబూషేన్ (72 పరుగులు), స్టీవ్ స్మిత్ (68 పరుగులు) కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలోనే తొలి మూడు వికెట్లకు వరుసగా 50+ భాగస్వామ్యాలు నమోదయ్యాయి.
మళ్లీ బుమ్రానే
ఆసీస్ టాపార్డర్ నిలకడగా ఆడుతుండడం వల్ల భారత్‌కు డీలా పడింది. తొలుత ప్రభావం చూపని బుమ్రా, క్రమంగా టచ్‌లోకి వచ్చాడు. 44.1 ఓవర్ వద్ద ఖవాజాను ఔట్ చేసి తొలి వికెట్ దక్కించుకున్నాడు. ఇక ప్రమాదకరమైన ట్రావిస్ హెడ్ (0)ను బుమ్రా చక్కని ఇన్‌స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. అక్కడే భారత్ మళ్లీ గేమ్‌లోకి వచ్చింది. లేదంటే హెడ్ మరోసారి భారీ స్కోర్ చేసేవాడేమో! ఆ తర్వాత మిచెల్ మార్ష్ (4) ను కూడా పెవిలియన్ చేర్చి భారత్‌కు బుమ్రా మళ్లీ బ్రేక్ ఇచ్చాడు.