Isa Guha apologises Bumrah : టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, మహిళా కామెంటేటర్ ఇసా గుహా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై మరోసారి స్పందించిన ఇసా గుహా, బుమ్రాకు క్షమాపణలు చెప్పింది.
అసలేం జరిగిందంటే? - ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా మైదానం వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో బుమ్రా ఆరు వికెట్లతో అదరగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఇసా గుహా, రెండో రోజు ఆటలో జస్‌ప్రీత్ బుమ్రా ప్రదర్శనను ప్రశంసిస్తూ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. కోతి జాతికి చెందిన జంతువుతో బుమ్రాను పోల్చింది. ప్రైమేట్ అనే పదం వాడింది. దీంతో ఆమెపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మొదటగా ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ, బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'బుమ్రా ఈ రోజు ఐదు ఓవర్లలో 4 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇది కదా మాజీ కెప్టెన్ నుంచి జట్టు ఆశించేది' అని అన్నాడు. అయితే అతడి వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా, ఇసా గుహ కూడా బుమ్రాను ప్రశంసిస్తూ నోరు జారింది. 'అద్భుతం, బుమ్రా MVP. మోస్ట్ వాల్యూబుల్ ప్రైమేట్ జస్‌ప్రీత్ బుమ్రా'అని పేర్కొంది. అయితే ప్రైమేట్ అంటే కోతి జాతికి చెందిన జంతువు అని అర్థం. అందుకే నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం మళ్లీ ఇసా గుహ తన తప్పును సరిచేసుకుంది. బుమ్రాకు సారీ చెప్పింది. "నిన్న మ్యాచ్ సమయంలో కామెంట్రీ చేస్తున్నప్పుడు ఓ పదం వాడాను. కానీ, అది ఇతర అర్థాలకు దారి తీసింది. ఎవరినైనా బాధిస్తే క్షమాపణలు చెబుతున్నాను. ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా నేనెప్పుడు ప్రయత్నించను. నేను మాట్లాడిన మొత్తం మాటలు వింటే, బుమ్రాపై అత్యుత్తమ ప్రశంసలు కురిపించానని మీకే అర్థమవుతుంది. భారత్‌కు చెందిన గొప్ప ప్లేయర్స్‌ను ఎప్పుడూ తక్కువ చేయను. క్రికెట్ కోసం పాటుపడే వారికోసం ఎప్పుడూ ముందుంటాను. నేను బుమ్రాను గొప్పగా ప్రశంసించాను. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. దక్షిణ ఆసియా వారసత్వం కలిగిన వ్యక్తిగా, నేనెలాంటి దురుద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని అక్కడి అభిమానులు భావిస్తారని అనుకుంటున్నాను." అని గుహా వెల్లడించింది.
ఫస్ట్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ - బుమ్రా ఖాతాలో మరో రికార్డు