Ind vs Aus 3rd Test 2024 :గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ 405-7 స్కోర్‌తో పటిష్ఠ స్థితిలో ఉంది. క్రీజులో అలెక్స్ కేరీ (45), మిచెల్ స్టార్క్ (7) ఉన్నారు. స్టార్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (152 పరుగులు) భారీ శతకంతో మరోసారి సత్తాచాటగా, స్టీవ్ స్మిత్ (101 పరుగులు) సెంచరీతో రాణించాడు. టీమ్ఇండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టాడు. సిరాజ్, నితీశ్ కుమార్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.
వర్షం కారణంగా తొలి రోజు 13 ఓవర్ల ఆట సాధ్యపడింది. దీంతో రెండో రోజు ఆరగంట ముందుగానే మ్యాచ్ ప్రారంభమైంది. 28-0 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్, బుమ్రా, నితీశ్ దెబ్బకు 75 పరుగులకు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు నాథన్ మెక్‌స్వీనీ (9 పరుగులు), ఉస్మాన్ ఖవాజా (21 పరుగులు)ను బుమ్రా ఔట్ చేశాడు. అనంతరం మార్నస్ లబుషేన్ (12 పరుగులు)ను యంగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ వెనక్కి పంపాడు.
అడ్డుగా నిలబడ్డారు
లబుషేన్ ఔట్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ట్రావిస్ హెడ్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. మరో ఎండ్‌లో స్మిత్ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. భారత బౌలర్ల దాడిని సమర్థంగా ఎదుర్కొంటూ ఈ జోడీ క్రీజులో చాలాసేపు పాతుకుపోయింది. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు ఏకంగా 241 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ఇద్దరూ సెంచరీ మార్క్ దాటేశారు. టెస్టుల్లో హెడ్‌కు ఇది 9వ శతకం కాగా, భారత్‌పై మూడోది కావడం గమనార్హం. ఇక స్మిత్ దాదాపు 25 ఇన్నింగ్స్‌ల తర్వాత శతకం బాదాడు. టెస్టుల్లో అతడికి ఇది 33వ సెంచరీ.