Border-Gavaskar Trophy Nitish Kumar Reddy :అది 2024 ఏప్రిల్ 5. ఐపీఎల్‌లో ఓ కుర్రాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి వరకు క్రికెట్ లవర్స్‌కు ఈ పేరు పరిచయమే లేదు. పైగా తొలి మ్యాచ్‌లో అతడు రాణించిందీ కూడా లేదు. కానీ కట్ చేస్తే ఏడున్నర నెలలు గిర్రున తిరిగాయి. 2024 నవంబరు 22న ఇప్పుడా ఆ కుర్రాడే ప్రతిష్ఠాత్మక బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఆడుతున్నాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా తుది జట్టులో చోటు దక్కించుకుని, అనుకున్నట్లుగానే మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. పెర్త్ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విలువైన 41 పరుగులు సాధించాడు. దీంతో అతడిపై ప్రశంసలు మొదలయ్యాయి. కాబట్టి అతడు రెండో ఇన్నింగ్స్‌తో పాటు మొత్తంగా ఈ సిరీస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అతడి కెరీర్ గొప్ప మలుపు తిరిగే అవకాశం ఉంటుంది.
మొదటి మూడింటిలో నో ఛాన్స్ - నాలుగో ఛాన్స్ ఫెయిల్(Nitish Kumar IPL Chance)
ఐపీఎల్‌తో పలువురు క్రికెటర్లు మంచి ప్రదర్శన చేసి, జాతీయ జట్టులో అవకాశం దక్కించుకుని మేటి క్రికెటర్లుగా ఎదిగారు. రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ ఇలా చాలా మందే ఉన్నారు. ఇప్పుడా జాబితాలోకి నితీశ్ కుమార్ రెడ్డి కూడా వచ్చేలా కనిపిస్తున్నాయి. అదే బాటలో పయనించేలా కనిపిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేసినప్పుడు అతడికి తన తొలి మూడు మ్యాచ్‌ల్లో అవకాశం రాలేదు. నాలుగో మ్యాచ్‌లో కేవలం 14 పరుగులే చేయగలిగాడు. కానీ ఆ తర్వాత మ్యాచ్‌లో 37 బంతుల్లో 64 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ (పంజాబ్ కింగ్స్‌పై) ఆడడంతో పాటు ఒక వికెట్ కూడా తీసి అందరి దృష్టిలో పడ్డాడు. తన పేరు తెలుసుకునేలా చేశాడు. మొత్తంగా 2024 సీజన్లో నితీశ్ రెడ్డి 303 పరుగులు సాధించడంతో పాటు 3 వికెట్లు కూడా తీశాడు.
నితీశ్‌కు నేషనల్ టీమ్‌లో ఛాన్స్ (Nitish Kumar National Team chance)
ఐపీఎల్ ప్రదర్శనతో నితీశ్‌కు టీమ్ ఇండియాలో చోటు దక్కింది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లోనూ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు నితీశ్. దిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో 74 పరుగులు చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీలోనూ మంచి ప్రదర్శన చేయడంతో అతడికి టెస్టు జట్టులో చోటు దక్కింది. అది కూడా ఏకంగా ప్రతిష్టాత్మక బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి. పైగా తొలి టెస్ట్ తుది జట్టులోనూ ఛాన్స్ వచ్చింది. నెట్ సెషన్స్‌లో నితీశ్ బౌలింగ్, బ్యాటింగ్‌కు మెచ్చి, మేనేజ్‌మెంట్ అతడికి తొలి మ్యాచ్ తుది జట్టులోనే అవకాశం ఇచ్చింది.
మంచి ప్రదర్శన చేస్తే (Nitish Reddy Border gavaskar Performance )
ఆస్ట్రేలియాతో ఆ దేశం గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడడం అంటే అరుదైన అవకాశం అనే చెప్పాలి. అది కూడా ఐపీఎల్ కెరీర్ ప్రారంభించిన ఏడున్నర నెలల్లోనే నితీశ్ ఈ సూపర్ ఛాన్స్‌ను అందుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో అదరగొడితే ఇక అతడికి ఎక్కడా కూడా తిరుగుండదని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.