IPL 2025 Retention Rules Kohli RCB : ఇటీవలే బీసీసీఐ ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన కొత్త రిటెన్షన్ రూల్స్‌ను స్పష్టం చేసింది. అయితే ఈ నియమాలు జట్టు వ్యూహాలపై ప్రభావం చూపనున్నాయి. 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లకు కొన్ని చిక్కులు ఉన్నాయి. వాస్తవానికి కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్‌లు వేలంలో పాల్గొంటే భారీ ధర అందుకోవచ్చు. ఒకవేళ ప్రస్తుతం ఉన్న ఫ్రాంఛైజీతోనే కొనసాగాలని నిర్ణయించుకుంటే భారీగా ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. పైగా ఆర్సీబీకి ఎక్కువ మేలు జరుగుతుంది? ఎలాగంటే?
కోహ్లీ రిటెన్షన్ వాల్యూ - కొత్త నిబంధనల ప్రకారం, ఫ్రాంఛైజీ మొదటి ఎంపిక ఆటగాడిని అట్టిపెట్టుకోవడానికి అయ్యే ఖర్చు రూ.15 కోట్ల నుంచి రూ.18 కోట్లకు పెరిగింది! ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కొనసాగించే ఆటగాళ్లలో మొదటి వ్యక్తిగా కోహ్లీని ఎంచుకుంటే విరాట్ ఐపీఎల్ శాలరీ రూ.3 కోట్లు పెరిగే అవకాశం ఉంది. అతడు ప్రస్తుతం ఫ్రాంఛైజీ నుంచి రూ.15 కోట్లు అందుకుంటున్నాడు.
కాగా, చాలా కాలంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కోహ్లీ కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్‌లో కూడా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. అతడి పర్ఫార్మెన్స్, లీడర్‌షిప్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్‌తో ఆర్సీబీ మొదటి రిటెన్షన్ స్పాట్‌కు కోహ్లీనే ఎంచుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆర్సీబీ ఆర్థిక ప్రయోజనాలు - కోహ్లీని రూ.18 కోట్లకు అట్టిపెట్టుకోవడం ఆర్సీబీకి ఆర్థికంగా మేలు చేస్తుందనే చెప్పాలి. ఇది తెలివైన ఆర్థిక ఎత్తుగడ అవుతుంది. కోహ్లీ వేలంలోకి ప్రవేశిస్తే, అతడి విలువ సులభంగా రూ.20 కోట్లను అధిగమించవచ్చు. అదే కోహ్లీని తమ వద్దే రూ.18 కోట్లకు ఉంచుకుంటే ఫ్రాంఛైజీకి ఖర్చు ఆదా అవుతుంది.