Champions Trophy 2025 :2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. తమ మొండి వైఖరి మానుకొని హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించాలని పీసీబీకి ఐసీసీ సూచించినట్లు సమాచారం. లేదంటే పాకిస్థాన్ లేకుండానే టోర్నీ జరుగుతుందని పీసీబీకి ఐసీసీ హెచ్చరికలు జారీ చేసిందట. దీనిపై తమ నిర్ణయాన్ని శనివారంలోగా చెప్పాలని దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఐసీసీ హెచ్చరించిందట.
తాజాగా జరిగిన కౌన్సిల్ మీటింగ్‌లో పాకిస్థాన్ మినహా దాదాపు అన్ని దేశాలు హైబ్రిడ్ మోడల్‌కు ఓకే చెప్పాయట. అందుకే ఐసీసీ కూడా టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పీసీబీ ఛైర్మన్ మోసిన్ సఖ్వీ కూడా హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరిస్తేనే శనివారం మీటింగ్ జరుగుతుందని కౌన్సిల్ మెంబర్ ఒకరు చెప్పారు. లేదంటే పాకిస్థాన్ లేకుండానే టోర్నీని ఇతర దేశానికి షిఫ్ట్ చేస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం.
ఇక శనివారం మరోసారి అన్ని దేశాల బోర్డు ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై అప్పుడే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా, భద్రతా కారణాల దృష్యా టీమ్ఇండియా అక్కడికి వెళ్లడం లేదు. దీంతో బీసీసీఐ హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదన తీసుకొచ్చింది. కానీ, పీసీబీ మాత్రం హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించడం లేదు. టోర్నీని పూర్తిగా పాకిస్థాన్‌లోనే నిర్వహించాలని పట్టుగా ఉంది.