ICC Hall of Fame Criteria : ప్రపంచంలో ఏ క్రికెటర్ అయినా 'ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు దక్కించుకోవాలని ఆశపడుతుంటాడు. క్రికెట్లో లెజెండరీ ప్లేయర్లకు గుర్తింపుగా వారిని ఈ లిస్ట్‌లో యాడ్ చేస్తుంటారు. అయితే అసలీ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏమిటి? దీన్ని ఎవరు, ఎప్పుడు నుంచి ఇస్తున్నారు? ఎంత మంది భారతీయులు 'ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు సంపాదించుకున్నారు? తదితర విషయాలు తెలుసుకుందాం.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏమిటి?
క్రికెట్లో లెజెండరీ ప్లేయర్లకు గుర్తింపుగా, గౌరవసూచకంగా 2009లో ఐసీసీ ఈ 'హాల్ ఆఫ్ ఫేమ్'ను తీసుకొచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెజెండరీ క్రికెటర్లకు ఇందులో చోటు కల్పించి గౌరవిస్తోంది. అంతర్జాతీయ క్రికెటర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (FICA) సహకారంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్'లో ప్లేయర్లకు చోటు కల్పిస్తోంది. ఐసీసీ ఏర్పడి వందేళ్లు పూర్తైన సందర్భంగా 2009 జనవరి 2నుంచి ఈ లిస్ట్‌లో ప్లేయర్లకు చోటు కల్పించడం ప్రారంభించింది. 2009లో ఒకేసారి 55మందికి ఐసీసీ ఇందులో చోటు దక్కింది. ఐసీసీ వార్షిక అవార్డుల కార్యక్రమంలో దీనిపై ప్రకటనలు కూడా చేస్తుంటారు.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకోవడానికి ప్రమాణాలు?
'హాల్ ఆఫ్ ఫేమ్' గౌరవం కోసం ఎంపిక చేయనున్న ప్లేయర్ల గురించి ఓటింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియ ఇదివరకే 'హాల్ ఆఫ్ ఫేమ్'లో భాగమైనవారు, అంతర్జాతీయ క్రికెటర్స్ అసోసియేషన్స్ సమాఖ్య సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, మీడియా ప్రతినిధులు, ఐసీసీ సమక్షంలో జరుగుతుంది.
అర్హతలు
- క్రికెటర్ ఆటకు గుడ్‌బై చెప్పిన ఐదేళ్లు తర్వాత 'హాల్ ఆఫ్ ఫేమ్'లోకి చోటు దక్కించుకోవడానికి అర్హత సాధిస్తాడు.
- ఒక బ్యాటర్ రెండు ప్రధాన ఫార్మాట్లలో (వన్డే/టెస్టు) కనీసం 8,000 పరుగులు, 20 సెంచరీలు చేసి ఉండాలి. ఏదైనా ఫార్మాట్లో 50 కంటే ఎక్కువ బ్యాటింగ్ యావరేజ్ ఉండాలి.
- బౌలర్లు ఏదైనా ఒక ఫార్మాట్లో కనీసం 200 వికెట్లు తీసి ఉండాలి. కానీ టెస్టులు, వన్డేల్లో స్ట్రైక్ రేట్ వరుసగా 50, 30 కనీసం ఉండాలి.
- వికెట్ కీపర్ వన్డే లేదా టెస్టుల్లో ఏదో ఒక ఫార్మాట్లో 200 ఔట్స్ చేసి ఉండాలి.
- కెప్టెన్‌కు 'హాల్ ఆఫ్ ది ఫేమ్'లో చోటు దక్కాలంటే అతడు కనీసం 25 టెస్టులు, 100 వన్డేల్లో 50 కంటే ఎక్కువ శాతం విజయాలను నమోదు చేయాలి.