ICC Chairman Indians:బీసీసీఐ కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఛైర్మన్ పదవి రేసులో ఉన్నారు. ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్ క్లే పదవీకాలం నవంబరు 30తో ముగుస్తుంది. మరోసారి ఎన్నికల బరిలో నిలవకూడదని గ్రెగ్ బార్ క్లే నిర్ణయించుకోవడం వల్ల బీసీసీఐ కార్యదర్శి జై షా ఆ పదవి కోసం పోటీ పడొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐసీసీ వ్యవహారాల్లో బీసీసీఐది కీలక పాత్ర కావడం, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మద్దతు జైషాకు ఉండడం వల్ల ఐసీసీ అధ్యక్ష పదవి ఆయన వరించనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఐసీసీ ఛైర్మన్లుగా పనిచేసిన భారతీయులు ఎంత మంది? వారెవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జగ్మోహన్ దాల్మియా (1997-2000): భారత్, ఆసియా తరఫున మొదటి ఐసీసీ ఛైర్మన్గా జగ్మోహన్ దాల్మియా చరిత్ర సృష్టించారు. దాల్మియా ఈ పదవిలో 1997- 2000 వరకు కొనసాగారు. ఏకగ్రీవంగా ఐసీసీ ఛైర్మన్గా దాల్మియా ఎన్నికయ్యారు. అంతకుముందు 1996లో ఐసీసీ ఛైర్మన్ పదవి కోసం పోటీ చేసి త్రుటిలో దాన్ని కోల్పోయారు. ఆస్ట్రేలియాకు చెందిన మాల్కం గ్రేపై జగ్మోహన్ దాల్మియా పోటీ చేసి 23 ఓట్లను పొందారు. మాల్కం గ్రేకు 13 ఓట్లే వచ్చాయి. అయినా ఛైర్మన్ పదవి చేపట్టేందుకు ఐసీసీ రూల్స్ ప్రకారం మూడింట రెండొంతుల మెజారిటీ ఓట్లు రావాలి. దీంతో జగ్మోహన్ త్రుటిలో ఛైర్మన్ పదవిని కోల్పోయారు.
శరద్ పవార్ (2010-2012):భారత దిగ్గజ రాజకీయ నాయకుల్లో శరద్ పవార్ ఒకరు. ఈయన నాలుగుసార్లు మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు. అయితే రాజకీయాల్లోనే కాదు క్రికెట్ లోనూ శరద్ పవార్ చక్రం తిప్పారు. 2005-2008లో పవార్ బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2010లో ఐసీసీ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగారు.
ఎన్. శ్రీనివాసన్ (2014-2015): ఎన్. శ్రీనివాసన్ బీసీసీఐ కార్యదర్శిగా తొలుత పనిచేశారు. ఆ తర్వాత 2011లో శశాంక్ మనోహర్ నుంచి బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. 2014 వరకు శ్రీనివాసన్ ఈ పదవిలో కొనసాగారు. 2014లో ఐసీసీ ఛైర్మన్గా నియమితులయ్యారు. ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగారు.