Suresh Raina counter to Pakisthan Journalist : ఓ పాకిస్థానీ జర్నలిస్ట్‌కు టీమ్ ఇండియా మాజీ బ్యాటర్ సురేశ్ రైనా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇటీవల పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదితో పోలుస్తూ రైనాను ట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు పాకిస్థానీ జర్నలిస్ట్. దీంతో స్ట్రాంగ్‌గా రైనా బదులిచ్చాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే - పాకిస్థానీ జర్నలిస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఓ ట్వీట్‌తో రైనాను ఎగతాళి చేసేందుకు ప్రయత్నించాడు. షాహిద్ అఫ్రిది, రైనా ఉన్న రెండు ఫొటోలను పోస్ట్ చేశాడు. క్యాప్షన్‌లో ‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024కి షాహిద్ అఫ్రిదీని ఐసీసీ అంబాసిడర్‌గా నియమించింది. హలో సురేష్ రైనా?’ అని రాశాడు.
- నా ఇంట్లో 2011 వరల్డ్ కప్ ఉంది!
ఈ పోస్ట్‌కు రైనా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ‘నేను ICC అంబాసిడర్‌ని కాదు, కానీ నా ఇంట్లో 2011 ప్రపంచకప్ ఉంది. మొహాలీలో జరిగిన మ్యాచ్ గుర్తుందా? అది నీకు కొన్ని మరపురాని జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని ఆశిస్తున్నాను’ అని రైనా ట్వీట్‌కి ఘాటు రిప్లై ఇచ్చాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన సెమీ ఫైనల్‌ను ఉద్దేశించి రైనా ఈ కామెంట్స్ చేశాడు.
- షాహిద్ అఫ్రిదిపై రైనా చేసిన కామెంట్స్ ఏంటి?
ప్రస్తుత ఐపీఎల్ 2024లో రైనా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతకుముందు, జియోసినిమాలో హిందీ కామెంటరీ విధుల్లో ఉన్న సమయంలో ఆకాష్ చోప్రా రైనాను ఉద్దేశించి - ‘ఇంకా 37 ఏళ్లే కదా, రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకునే ఆలోచన ఏమైనా ఉందా? అని అడిగాడు.
ఇందుకు రైనా స్పందిస్తూ - ‘మై రైనా హు, షాహిద్ అఫ్రిది నహీ (నేను సురేశ్ రైనా. షాహిద్ అఫ్రిది కాదు)’ అని ఫన్నీగా రెస్పాండ్ అయ్యాడు. ఈ రిప్లైతో కామెంటరీ బాక్స్‌లోని అందరూ నవ్వారు. పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్, కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ కొన్ని సార్లు రిటైర్‌మెంట్ ప్రకటించి, అనంతరం ఇంటర్నేషనల్ క్రికెట్‌కు తిరిగొచ్చాడు. అందుకే రైనా అఫ్రిదీని ఉద్దేశించి మాట్లాడాడు.
కాగా, రైనా 2020లో ఎంఎస్ ధోనీతో కలిసి ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. చెన్నై సూపర్ కింగ్స్, 2021 సీజన్‌లో నాలుగో టైటిల్ గెలిచిన తర్వాత ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలికాడు. క్రికెట్‌కి దూరమైన రైనా ప్రస్తుతం కామెంటేటర్‌గా అలరిస్తున్నాడు.