Virat Kohli Ranji Trophy 2025 :టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దాదాపు 13ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. గురువారం దిల్లీ- రైల్వేస్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో విరాట్ బరిలోకి దిగుతున్నాడు. ఈ మ్యాచ్‌కు దిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ నేపథ్యంలో తమ అభిమాన స్టార్‌ను చూసేందుకు విరాట్ ఫ్యాన్స్ భారీగా స్టేడియానికి చేరుకున్నారు. దీంతో అక్కడి వాతావరణం ఇంటర్నేషనల్ మ్యాచ్‌ను తలపించేలా సందడిగా మారింది.
ఎలాగైన విరాట్ బ్యాటింగ్ చూడాల్సిందేనని వేల సంఖ్యలో అభిమానులు గురువారం ఉదయాన్నే స్టేడియానికి చేరుకున్నారు. సుమారు 2 కిలోమీటర్ల మేర క్యూలో నిల్చున్నారు. 'RCB', 'RCB' నినాదాలుతో అక్కడి పరిసరాలు కోలాహలంగా మారాయి. స్టేడియం గేట్ నెం16 వద్ద అభిమానులు బారులు తీరారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
విరాట్ ఎఫెక్ట్
ఒక డొమెస్టిక్ మ్యాచ్‌కు ఇంత భారీ సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియానికి రావడం చాలా అరుదు. వేలాది మంది అడియెన్స్‌ను చూస్తుంటే, ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుందా? అన్న సందేహం కలుగడం పక్కా! అయితే ఇదంతా 'విరాట్ మేనియా' అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
ఊహించిన దానికంటే ఎక్కువ
అయితే ఈ మ్యాచ్‌లు దాదాపు 10వేల మంది వస్తారని దిల్లీ క్రికెట్ అసోసియేషన్ ముందుగా అంచనా వేసింది. కానీ, తెల్లవారుజామునుంచే అభిమానలు స్టేడియానికి క్యూ కట్టారు. దీంతో క్రౌడ్‌ను స్టేడియం సిబ్బంది కంట్రోల్ చేయలేకపోయింది. అయితే మ్యాచ్‌కు ఫ్రీ ఎంట్రీ అని ప్రకటించడం వల్ల కూడా ఇంత భారీ క్రౌడ్ హాజరైంది.