Shikhar Dhawan Son :టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన వ్యక్తిగత జీవితంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. 2023లో తన భార్య ఆయేషా ముఖర్జీ నుంచి విడాకులు తీసుకున్న ధావన్, తన కుమారుడు జోరావర్ సంరక్షణను కోల్పోయాడు. కానీ, తన కుమారుడిని కలవొచ్చని, వీడియో కాల్ ద్వారా టచ్‌లో ఉండేందుకు కోర్టు అనుమతిచ్చినా ఫలితం లేకపోయింది. జొరావర్ను చూసేందుకు, మాట్లాడేందుకు పూర్తిగా అవకాశం లేకుండా శిఖర్ మాజీ భార్య అయేషా బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన కుమారుడిని తలచుకుని శిఖర్ మరోసారి ఎమోషనల్ అయ్యాడు.
కష్టంగా ఉంది- చాలా మిస్ అవుతున్నా
'నా కొడుకు జొరావర్ను చూసి రెండేళ్లు అవుతుంది. అతడితో మాట్లాడి ఏడాది అవుతుంది. అన్ని వైపులా నన్ను బ్లాక్ చేశారు. ఇది చాలా కష్టంగా ఉంది. కొడుకును మిస్ అవుతున్నాను. కానీ, నేను రోజూ అతడితో ఆధ్యాత్మికంగా మాట్లాడుతాను. అతడితో మాట్లాడుతున్నట్లు, కౌగిలించుకున్నట్లు ఫీలవుతాను. ఒకవేళ నా కొడుకును వెనక్కి రప్పించాలనుకుంటే నాకున్న దారి ఇదొక్కటే. బాధపడటం వల్ల ఏమీ జరగదు. నా కొడుకు జొరావర్ వయసు 11 ఏళ్లు. కానీ అతడితో రెండున్నరేళ్లు మాత్రమే గడిపాను' అని శిఖర్ ఓ పాడ్ కాస్ట్లో వ్యాఖ్యానించాడు.
తన కుమారుడిని భవిష్యత్తులో కలిసే అవకాశమొస్తే, ఆ క్షణాన్ని ఎలా ఆస్వాదిస్తాడో ధావన్ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. 'ముందుగా నా కొడుకు జొరావర్ను కౌగిలించుకుంటాను. అతడితో గడపడానికి సమయం కేటాయిస్తాను. జొరావర్ మాట వినడానికి ప్రాధాన్యత ఇస్తాను. నా ఇన్నింగ్స్ గురించి చూపించాలనే ఆలోచన నాకు లేదు. ఒకవేళ బాధతో జొరావర్ ఏడిస్తే నేను ఏడుస్తాను. నా కొడుకుతో గడిపే సమయాన్ని ఆస్వాదిస్తాను' అని ధావన్ తెలిపాడు.