Highest Paid IPL Indian Player 2024 :ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతోంది. ఇన్నేళ్లలో ఐపీఎల్ అతిపెద్ద క్రికెట్ లీగ్‌లలో ఒకటిగా ఎదిగింది. ప్రపంచంలోని రిచెస్ట్ స్పోర్ట్స్ లీగ్‌ల సరసన చేరిన ఏకైక క్రికెట్ లీగ్‌గా నిలిచింది. అందుకే దాదాపు ప్రపంచ క్రికెట్‌లో స్టార్‌లు అందరూ ఐపీఎల్ ఆడుతున్నారు. చాలామంది యంగ్ ప్లేయర్‌లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ నుంచి భారీగా సంపాదిస్తున్న భారత్ ఆటగాడు ఎవరో తెలుసా?
వీరెవరూ లిస్ట్‌లో లేరు!
గత మినీ వేలానికి ముందే అనూహ్యంగా గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యా ముంబయి ఇండియన్స్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ముఖేశ్ అంబానీ యాజమాన్యంలోని ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యాతో రూ.15 కోట్లకు అగ్రిమెంట్ చేసుకుంది. అయితే మాజీ ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్రాంచైజీ నుంచి ఏటా రూ.16 కోట్లు సంపాదిస్తున్నాడు. ఇప్పటికీ ఎంఐ జట్టులో అత్యధిక పారితోషికం అందుకునే ఆటగాడు హిట్‌మ్యాన్ మాత్రమే. అయితే ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న లిస్టులో భారత్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రిషభ్ పంత్ లేరు.
ఐపీఎల్‌లో ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న భారత ఆటగాడు ఎవరు?
kL Rahul IPL 2024 Remuneration :వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్, టీమ్‌ఇండియా వైస్-కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్-2024లో అత్యధిక పారితోషికం పొందిన భారత ఆటగాడు. 2022లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) అతన్ని రూ.17 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో అతడు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పారితోషికం పొందిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఫ్రాంచైజీ రాహుల్‌ను 2023, 2024 సీజన్‌లకు కెప్టెన్‌గా కొనసాగించింది. ఇక Sportskeeda నివేదిక ప్రకారం రాహుల్ 2013లో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున అరంగేట్రం చేసినప్పటి నుంచి మొత్తం రూ.82.1 కోట్లు సంపాదించాడు.
రోహిత్ స్థానం ఎంతంటే?
అయితే రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్ తమ కాంట్రాక్ట్‌ల ద్వారా ఏటా రూ.16 కోట్లు సంపాదిస్తూ రెండో స్థానంలో నిలిచారు. ముంబయి ఇండియన్స్ నుంచి రూ.15.25 కోట్లు సంపాదిస్తున్న ఇషాన్ కిషన్ మూడో స్థానంలో ఉన్నాడు.