Harry Brook England Series : సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమ్ఇండియా సర్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తొలి మ్యాచ్ వేదికైన హైదరాబాద్‌కు టీమ్ఇండియా జట్టుకు చెందిన ప్లేయర్స్ వచ్చారు. అయితే ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాల వల్ల ఆ జట్టు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సిరీస్ మొత్తం నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించింది. బ్రూక్ కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకే అతడ్ని రిలీవ్ చేసినట్లు ఈసీబీ ఆ ప్రకటనలో పేర్కొంది.
''వ్యక్తిగత కారణాల వల్ల హ్యారీ బ్రూక్ తక్షణమే ఇంగ్లాండ్ జట్టును వీడి స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు భారత్‌కు వెళ్లడం లేదు '' అంటూ ఈసీబీ ఆ ప్రకటనలో తెలిపింది. ఈ సమయంలో బ్రూక్ గోప్యత విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ మీడియాతో పాటు ప్రజలను ఈసీబీ కోరింది.
మరోవైపు బ్రూక్ జట్టుకు దూరమవ్వడం అనేది ఇంగ్లాండ్ ప్రతికూలాంశమని క్రికెట్ విశ్లేషకుల మాట. డైనమిక్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న ఈ స్టార్ క్రికెటర్ గత 18 నెలలుగా ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 12 టెస్టుల్లో 1181 పరుగులు స్కోర్ చేశాడు. 62 సగటుతో, 91 స్ట్రైక్ రేటుతో దూసుకెళ్లాడు. 2022 చివరిలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో హ్యారీ అదరగొట్టాడు. 98 సగటుతో అయిదు ఇన్నింగ్స్‌ల్లో 468 పరుగులు చేశాడు. అంతే కాకుండా ఆ టోర్నీలో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును కూడా అందుకున్నాడు.
ఇక బ్రూక్ స్థానంలో వచ్చే మరో ఆటగాడి గురించి ఈసీబీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇంగ్లాండ్ టెస్టు జట్టు అబుదాబి నుంచి భారత్‌కు ఆదివారం రానుంది. ఇప్పటికే విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, రవిచంద్ర అశ్విన్ హైదరాబాద్‌కు వచ్చాడు. జనవరి 25 నుంచి ప్రారంభమయ్యే అయిదు టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు ఉప్పల్ వేదికగానే జరగనుండగా, విశాఖ వేదికగా రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుంది. చివరి మూడు టెస్టులు రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాల వేదికగా జరగనున్నాయి.