Harbhajan Singh Dhoni Controversy :టీమ్ఇండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ధోనీతో పదేళ్లుగా మాటల్లేవని, తామిద్దరూ స్నేహితులు కాదని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌లో సీఎస్కే (2018- 2020) తరఫున ఆడినప్పుడు కూడా మైదానంలోనే, అది కూడా లిమిట్‌గానే మాట్లాడనినట్లు తాజాగా వెల్లడించాడు.
'ధోనీతో నేను మాట్లాడను. 10ఏళ్లుగా మా మధ్య మాటల్లేవ్. అతడితో నాకు ఏ ప్రాబ్లమ్ లేదు. అతడే మాట్లాడటం లేదు. దానికి కారణం ఏంటో తెలియదు. అయితే నేను చెన్నై తరఫున ఆడినప్పుడు మాత్రం మేము కాస్త మాట్లాడుకున్నాము. అది కూడా మైదానం వరకే పరిమితం. అతడు నా గదిలోకి రాలేదు, నేను అతడి రూమ్‌లోకి వెళ్లలేదు. ధోనీతో నాకు ఎలాంటి విరోధం లేదు. అతడు ఏదైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పగలడు.
కానీ, ఏదైనా ఉంటే ఇప్పటికే చెప్పి ఉండేవాడు. ధోనీకి నేనెప్పుడూ ఫోన్ చేయను. నా ఫోన్ కాల్స్‌కి ఎవరైతే స్పందిస్తారో వారికే చేస్తాను. స్నేహితులుగా ఉన్న వారితో టచ్‌లో ఉంటాను. సంబంధం అనేది ఎల్లప్పుడూ ఇచ్చిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది. మనం ఎదుటివారిని గౌరవిస్తే వారి నుంచి కూడా అదే ఆశిస్తాం. కానీ, ఎవరికైనా ఒకట్రెండుసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోతే వారిని అవసరమైనప్పుడు మాత్రమే కలుస్తాను’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
ధోనీ కెప్టెన్సీలో భారత్ 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ సాధించిన రెండు జట్లలో హర్భజన్ సభ్యుడు. వీరిద్దరూ కలిసి చివరిగా 2015లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో ఆడారు. ఆ మ్యాచ్‌లో భజ్జీ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 70 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. కాగా, భారత్ 214 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.