Maxwell Sehwag Fight :టీమ్ఇండియా దిగ్గజ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్- ఆసీస్ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇద్దరి మధ్య గతంలో జరిగిన ఓ వివాదం తాజాగా తెరపైకి వచ్చింది. 2017 ఐపీఎల్ సందర్భంగా వాళ్లిద్దరి మధ్య జరిగిన ఓ సంఘటన గురించి మ్యాక్స్‌వెల్ తాజాగా రిలీజ్ చేసిన 'ది షో మ్యాన్' పుస్తకంలో ప్రస్తావించాడు. ఆ సీజన్లో మ్యాక్స్‌వెల్ పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ కాగా, సెహ్వాగ్ ఫ్రాంచైజీ డైరెక్టర్‌గా వ్యవహరించాడు.
అయితే సెహ్వాగ్ ఎక్కువగా కెప్టెన్ నిర్ణయాలను ప్రభావితం చేసేవాడని, తుది జట్టుని తనే ఎంపిక చేసేవాడని మాక్స్‌వెల్ ఆరోపించాడు. ఆ సీజన్లో జట్టు వ్యవహారాల్లో సెహ్వాగ్ జోక్యం చేసుకున్నారని మాక్స్‌వెల్ పుస్తకంలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైలర్‌గా మారాయి.
అసలేం జరిగిందంటే?
'ఓ టెస్టు సిరీస్‌లో కలుసుకున్నప్పుడు నేను పంజాబ్‌కి కెప్టెన్‌గా ఉండబోతున్నట్లు సెహ్వాగ్ చెప్పాడు. అదే సమయంలో అతడు 'మెంటార్'గా ఉన్నాడు. దీంతో జట్టు ఎలా ఉందనే అంశంపై చర్చించాం. అప్పుడు అందరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయని అనుకున్నాను. కానీ, అదే నేను చేసిన తప్పు. మా కోచ్ అరుణ్ కుమార్‌కి అదే తొలి సీజన్. అయితే అతడు పేరుకు మాత్రమే కోచ్. తెరవెనుక అన్ని నిర్ణయాలు సెహ్వాగే తీసుకునేవాడు. ఇతర కోచ్‌లు, ఆటగాళ్లు నా దగ్గరకు వచ్చి 'అసలు ఏం జరుగుతుంది?' అని నన్ను పలుమార్లు అడిగే వారు. వాళ్లకు సమాధానం చెప్పడానికి చాలా ఇబ్బంది పడేవాడిని'
'లీగ్‌లో చివరి మ్యాచ్‌లో మేం 73 పరుగులకు ఆలౌట్ అయ్యాం. ఆ మ్యాచ్ అనంతరం ప్రెస్‌మీట్‌కు నేను వెళ్లాల్సి ఉంది. కానీ, ఆ ప్రెస్‌మీట్‌కు సెహ్వాగ్ హాజరై, నన్ను బాధ్యత లేని కెప్టెన్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. ఇక నేను టీమ్ బస్‌లోకి వెళ్లేసరికి, వాట్సాప్ గ్రూప్ నుంచి నన్ను తీసేశారు. నాకేం అర్థం కాలేదు. హోటల్‌కి చేరుకునే సమయానికి సెహ్వాగ్ నుంచి వరుసగా మెసేజ్‌లు వస్తున్నాయి. కెప్టెన్‌గా సరైన బాధ్యతలు తీసుకోవడం లేదని సెహ్వాగ్ నన్ను నిందించాడు'