Hardik Pandya Red Ball Cricket :టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఇటీవల ఎర్ర బంతితో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో హార్దిక్ టెస్టు ఫార్మాట్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని, త్వరలో జరిగే రంజీలో బరోడా తరపున బరిలోకి దిగుతాడని ప్రచారం సాగింది. అయితే ఈ విషయంపై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ తాజాగా స్పందించాడు. అతడు రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ చేయడానికి కారణం ఏంటో తెలిపాడు.
'పాండ్యను మళ్లీ టెస్టుల్లో చూస్తానని నేను అనుకోవడం లేదు. అయితే ఆ రోజు అక్కడ తెల్ల బంతి అందుబాటులో లేకపోవడం వల్లే, అతడు ఎర్ర బంతితో ప్రాక్టీస్ చేసి ఉంటాడు. పాండ్య శరీరం నాలుగు- ఐదు రోజుల ఆటకు సహకరించదు. ఒకవేళ అతడిని టెస్టుల్లో తీసుకురావాలని భావిస్తే, అంతకంటే ముందు కనీసం ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడించాలి. నాకు తెలిసి అది అసాధ్యం' అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు.
అయితే 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన పాండ్య ఆ తర్వాతి ఏడాదిలోనే టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ, టెస్టుల్లో కేవలం ఒక్క ఏడాదే కొనసాగాడు. 11 మ్యాచ్‌ల్లో 532 పరుగులు చేసిన పాండ్య, 17 వికెట్లు పడగొట్టాడు. ఇక 2018లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ పాండ్యకు ఆఖరి టెస్టు. అప్పట్నుంచి సుదీర్ఘ ఫార్మాట్ ఆటకు హార్దిక్ దూరంగా ఉంటూ వస్తున్నాడు.