Ajay Jadeja Nawanagar Jamsaheb : జామ్ నగర్ రాజ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రాజ కుటుంబానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గౌరవం ఉంది. అయితే తాజాగా ఈ రాయల్ ఫ్యామిలీ కీలక ప్రకటన చేసింది. విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను తన కుటుంబ వారసుడిగా ప్రకటించింది. నవానగర్(జామ్ నగర్ పాత పేరు) సంస్థానానికి కాబోయే మహారాజు(జామ్‌సాహెబ్)గా జడేజా పేరును ప్రకటించింది. ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్జీ దిగ్విజయ్ సింహ్‌జీ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు. దీంతో అజయ్ జడేజా నవానగర్ మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నారు.
"పాండవులు తమ 14 సంవత్సరాల అజ్ఞాత వాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని విజయం సాధించిన రోజు దసరా. ఈ రోజు, అజయ్ జడేజా నా వారసుడిగా, నవానగర్ తదుపరి జంసాహెబ్‌గా ఉండటానికి అంగీకరించినందున నేను కూడా విజయం సాధించినట్లు భావిస్తున్నాను, ఇది జామ్‌నగర్ ప్రజలకు గొప్ప వరం అని నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్యూ జడేజా." అని శత్రుసల్యసింహ్జీ అన్నారు.
కాగా, ఒకప్పటి ప్రిన్స్‌లీ స్టేట్ నవానగర్‌నే ప్రస్తుతం జామ్ నగర్‌గా పిలుస్తున్నారు. దేశంలో రాచరిక వ్యవస్థ అంతమైనప్పటికీ గుజరాత్‌లోని ఈ ప్రాంతంలో రాజకుటుంబ పాలన ఇంకా కొనసాగుతూనే ఉంది. జామ్‌నగర్ రాజ కుటుంబానికి చెందిన వాడే అజయ్ జడేజా కూడా. అతడు క్రికెట్‌పై ఉన్న మక్కువతో మైదానంలో అడుగుపెట్టి తనదైన ముద్ర వేశారు. ఇంకా జామ్ నగర్ కుటుంబంలో గర్వించదగిన గొప్ప క్రికెట్ వారసత్వం ఉంది. ఈ కుటంబానికి చెందిన కేఎస్ రంజిత్ సింహ్‌జీ, కేఎస్ దులీప్ సింహ్‌జీ పేర్లనే రంజీ, దులీప్ ట్రోఫీగా నామకరణం చేశారు.
అజయ్ జడేజా తన కెరీర్లో మంచి ప్రదర్శన చేసి లెజెండ్‌గా ఎదిగాడు. 1992 నుంచి 2000 వరకు టీమ్ ఇండియాకు ప్రాతినిథ్యం వహించిన అతడు 15 టెస్ట్ మ్యాచులు, 196 వన్డేలు ఆడాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయడం, సింగిల్ వచ్చేచోట రెండో పరుగు తీయడం లాంటివి చేయడం అజయ్ జడేజా స్పెషాలిటీ.