Yuvraj Singh vs Ms Dhoni:టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి, ప్రముఖ క్రికెట్ కోచ్ యోగ్‌రాజ్ సింగ్ ఎమ్ఎస్ ధోనీపై మరోసారి మండిపడ్డారు. తన కుమారుడి కెరీర్‌ను మాజీ కెప్టెన్ ధోనీయే నాశనం చేశాడని ఆరోపించారు. ఈ విషయంలో అతడిని ఎప్పటికీ క్షమించనని యోగ్‌రాజ్ పేర్కొన్నారు. ఆయన ఇటీవల పాల్గొన్న ఓ యూట్యూబ్ ఛానెల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి.
'ధోనీని నేను క్షమించను. అతడు ఫేమస్ క్రికెటరే. కానీ, నా కుమారుడికి మాత్రం క్షమించరాని అన్యాయం చేశాడు. ప్రతిదీ ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ఇంకా 4-5 ఏళ్లు క్రికెట్ ఆడగలిగే నా కుమారుడి కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడు. నాకు అన్యాయం చేసిన వాళ్లను నేను ఎప్పటికీ క్షమించను. వాళ్లను నా కుటుంబ సభ్యులైనా దగ్గరికి రానివ్వను. ధోనీ ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అప్పటి స్టార్లు గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా మరో యువరాజ్ రాడని అన్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూనే దేశం కోసం ఆడి ప్రపంచకప్ గెలిచినందుకు భారత ప్రభుత్వం యువరాజ్‌కు భారతరత్న ఇవ్వాలి' అని యోగ్‌రాజ్ అన్నారు.
భారత్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వరల్డ్‌కప్ గెలవడంలో యువరాజ్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. అయితే, అతడికి తగినంత గుర్తింపు దక్కలేదని పలువురు మాజీ క్రికెటర్ల అభిప్రాయం. ధోనీ నాయకత్వంలో టీమ్ఇండియా వన్డే వరల్డ్‌కప్ నిలిచినప్పుడే యూవీ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఆపై మెరుగైన చికిత్స తీసుకొని దాని నుంచి కోలుకొని ఆపై తిరిగి టీమ్‌ఇండియాలో చేరాడు. ఆ తర్వాత ఆశించదగిన రీతిలో యూవీ రాణించలేదు.