Rohit Sharma Ranji Trophy :టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేలవ ఫామ్ తో మరోసారి నిరాశపరిచాడు. 10 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ముంబయి తరపున ఆడుతున్న రోహిత్ కేవలం మూడు పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ ఆరంభం నుంచే జమ్ముకశ్మీర్ బౌలర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో 19 బంతులు ఎదుర్కొని 3 పరుగులకే ఔట్ అయ్యాడు. అలాగే యశస్వీ జైస్వాల్(5), గిల్ (4) సైతం ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు.
దారుణంగా విఫలమైన రోహిత్
రెడ్‌బాల్ క్రికెట్లో రోహిత్ శర్మ గతేడాది దారుణంగా విఫలమయ్యాడు. గత 15 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 10.93 సగటుతో 164 పరుగులు మాత్రమే చేశాడు. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లో పేలవ ఫామ్ కనబరిచాడు. దీంతో తిరిగి ఫామ్‌ను అందుకునేందుకు దేశవాళీ క్రికెట్ వైపు మొగ్గు చూపాడు. దాదాపు 10 ఏళ్ల (3,365 రోజులు) తర్వాత గురువారం నుంచి జమ్ముకశ్మీర్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో రోహిత్ ఆడుతున్నాడు. ఓపెనర్‌గా బ్యాటింగ్ దిగిన రోహిత్ శర్మ 19 బాల్స్ ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఉమర్ నజీర్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగి మరోసారి విఫలమయ్యాడు.
టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ అజింక్య రహానే ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత, భారత ఓపెనింగ్ జోడీ అంటే యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ ముంబయి ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉన్న ఉమర్ నజీర్ బౌలింగ్‌లో రోహిత్ ఇబ్బందిపడ్డాడు. అతడి ఓవర్లోనే ఆఖరికి ఔట్ అయ్యాడు.
జైస్వాల్ సైతం విఫలం
అయితే, రోహిత్ శర్మతో ఓపెనర్‌గా వచ్చిన యశస్వీ జైస్వాల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 43 సగటుతో 391 పరుగులు స్కోర్ చేశాడు. అందులో ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే జమ్ముకశ్మీర్ పైనా జైస్వాల్‌కు మంచి రికార్డులు ఉన్నాయి. కానీ, ఈ మ్యాచ్‌లో జైస్వాల్ 8 బంతుల్లో 5 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
గిల్ పేలవ ఫామ్ కొనసాగింపు
అలాగే దేశవాళీ క్రికెట్ కమ్‌బ్యాక్‌లో టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కూడా నిరాశపరిచాడు. పంజాబ్ తరఫున రంజీ బరిలోకి దిగిన గిల్ సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యాడు. కర్ణాటకతో తాజాగా జరిగిన మ్యాచ్‌లో 8 బంతుల్లో 4 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ బాటపట్టాడు. కాగా, పంజాబ్ టీమ్‌కు కెప్టెన్ ప్రస్తుతం గిల్ ఉన్నాడు.