తెలంగాణ

telangana

ETV Bharat / sports

అతిపెద్ద మెగాటోర్నీకి వేళాయే - బరిలో 24 జట్లు! - Euro Cup 2024 - EURO CUP 2024

Euro Cup 2024 : 17వ యూరో కప్‌తో ఫుట్‌బాల్ సందడికి వేళైంది. జూన్ 15న జర్మనీ వర్సెస్ స్కాట్లాండ్‌లు తొలి మ్యాచ్‌తో టోర్నీ ఆరంభం కానుంది. పూర్తి వివరాలు స్టోరీలో

source ANI
Euro Cup 2024 (source ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 10:09 AM IST

Euro Cup 2024 :యావత్ క్రీడా ప్రపంచాన్ని ఉర్రూతలూగించే మెగా టోర్నీకి వేళైంది. నాలుగేళ్లకోసారి జరిగే ఫుట్‌బాల్ యూరో కప్ పోటీలు ఆరంభం కానున్నాయి. ఫిఫా ప్రపంచకప్ తర్వాత జరిగే అతిపెద్ద టోర్నీ ఇదే. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే జూన్ 15 తెల్లవారకముందే 12:30 నిమిషాలకు ప్రారంభం కానుంది.

యూరప్ విజేతగా నిలిచి తమని తాము నిరూపించుకోవాలని మొత్తం 24 జట్లు 6 గ్రూపులుగా విడిపోయి గ్రూప్ దశలో తలపడనున్నాయి. ఈ పోటీలో భాగంగా తొలి మ్యాచ్ గ్రూప్-ఏ జట్లు అయిన ఆతిథ్య జర్మనీ వర్సెస్ స్కాట్లాండ్‌ల మధ్య జరుగుతుంది. ఈ 17వ యూరో కప్‌కు జర్మనీ ఆతిథ్యమిస్తుండగా జూన్ 14 నుంచి జులై 14వరకూ 10 నగరాల్లో కలిపి మొత్తం 51 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 6 గ్రూపులుగా ఆడుతూ ప్రతి గ్రూప్‌లో ఒక్కో జట్టు ఇతర దేశాల జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున ఆడాల్సి ఉంది. గ్రూప్ దశ పూర్తయ్యేసరికి టాప్ 2 జట్లన్నీ కలిపి 12 జట్లు, వాటితో పాటు 6 గ్రూపుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మూడో స్థానంలో నిలిచిన 4 జట్లను కలిపి రౌండ్16కు పంపిస్తారు. అక్కడ క్వార్టర్స్ నిర్వహించి, సెమీస్ ఆ తర్వాత ఫైనల్స్‌లో విజేతను నిర్ణయిస్తారు.

2000వ సంవత్సరం తొలిసారి రష్యా లేకుండా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఉక్రెయిన్ పై యుద్దం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. 53 దేశాలు తలపడ్డ క్వాలిఫికేషన్ రౌండ్లో రష్యా పాల్గొనకూడదంటూ యూఈఎఫ్ఏ (ఐరోపా ఫుట్‌బాల్ సంఘాల కూటమి) నిషేదాజ్ఞలు విధించింది. చివరిసారిగా ఈ టోర్నీని 2021లో నిర్వహించారు. 2020లో జరగాల్సిన టోర్నీ కరోనా కారణంగా సంవత్సరం ఆలస్యంగా జరిగింది. ఆ టోర్నీలో ఇటలీ విజేతగా నిలిచి తమ దేశానికి రెండో టైటిల్ పట్టుకుపోయింది.

ఏయే గ్రూపులో ఎవరు ఆడుతున్నారంటే
గ్రూప్ ఏ - జర్మనీ, స్కాట్లాండ్, హంగేరీ, స్విట్జర్లాండ్
గ్రూప్ బీ - స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ, అల్బేనియా
గ్రూప్ సీ - స్లోవేనియా, డెన్మార్క్, సెర్బియా, ఇంగ్లాండ్
గ్రూప్ డీ - పోలాండ్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, ఫ్రాన్స్
గ్రూప్ ఈ - బెల్జియం, స్లోవేకియా, రొమేనియా, ఉక్రెయిన్
గ్రూప్ ఎఫ్ - తుర్కియే, జార్జియా, పోర్చుగల్, చెక్ రిపబ్లిక్

యూరో కప్‌తో పాటు అమెరికాలో మరో ప్రతిష్ఠాత్మక ఫుట్‌బాల్ టోర్నీ అయిన కోపా అమెరికాకు తెరలేవనుంది. జూన్ 20 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీతో ఫుట్‌బాల్ ప్రియులకు కన్నుల పండుగే మరి. ఇక అసలైన ఫిఫా వరల్డ్ కప్ 2026లో ప్రారంభం కానుండగా ఈ టోర్నీకి కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details