IND VS PAK Emerging Asia cup 2024: ఎమర్జింగ్ ఆసియాకప్ - 2024లో టీమ్ఇండియా ఎ శుభారంభం చేసింది. శనివారం మస్కట్ అల్ అమెరత్ క్రికెట్ స్టేడియం (Al Amerat Cricket Ground Oman) వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో నెగ్గింది. టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్థాన్‌ను ఢీ కొట్టిన యువ భారత్ సత్తా చాటింది. భారత్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్ల నష్టానికి 176 స్కోర్‌కే పరిమితమైంది.
చివరి ఓవర్లో పాకిస్థాన్ విజయానికి 17 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో తొలి బంతికే అబ్దుల్ సమద్ ఔటయ్యాడు. దీంతో సమీకరణం 5 బంతుల్లో 17 పరుగులుగా మారింది. రెండో బంతికి సింగిల్ రాగా, మూడో బంతికి 4 లభించింది. 3 బంతుల్లో 12 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో నాలుగు, ఐదు బంతులు డాట్ అయ్యాయి. ఇక ఆఖరి బంతికి ఫోర్ వచ్చింది. దీంతో భారత్ 7 పరుగుల తేడాతో నెగ్గింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (44 పరుగులు, 35 బంతుల్లో : 2x4, 2x6), అభిషేక్ శర్మ (35 పరుగులు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (36 పరుగులు) రాణించారు.