Pippalada Story : ఉపనిషత్తును రచించిన మహా జ్ఞాని పిప్పలాదుడు. తన తపస్సుతో మానవులకు జన్మించిన 5 సంవత్సరాల వరకు శని దోషాలు లేకుండా చేసిన గొప్ప మహర్షి. పిప్పలాదుని చరిత్ర ఒక్కసారి చదివితే జీవితంలో శని బాధలు, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అసలు ఇంతకీ ఎవరీ పిప్పలాదుడు? ఆయన చరిత్ర ఏమిటి? అనే విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎవరీ పిప్పలాదుడు!
జన్మించిన 5 సంవత్సరాల వరకు శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు పిప్పలాదుని జన్మ వృత్తాంతం తెలుసుకుందాం. మహా దాన కర్ణుడిగా పేరొంది ఇంద్రుని వజ్రాయుధాన్ని తన ఎముకలను ఇచ్చిన గొప్ప మహర్షి దధీచి. ఆయన మరణానంతరం మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్నప్పుడు, ఆయన భార్య తన భర్త వియోగాన్ని తట్టుకోలేక, సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది. ఈ విధంగా దధీచి మహర్షి, ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు. కానీ రావి చెట్టు యొక్క రంద్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు. చుట్టూతా అంధకారం, ఏమీ కనిపించకపోవడం, ఎవరూ లేకపోవడం వల్ల ఆ పిల్లవాడు రావి చెట్టు రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. తరువాత కాలంలో రావి ఆకులు, పండ్లు తింటూ పెరిగి పెద్దయ్యాడు.
పిల్లవాని వివరాలు తెలుసుకున్న నారదుడు
ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్తూ రావి చెట్టు రంధ్రంలో ఉన్న పిల్లవాడిని చూసి ఆశ్చర్యపోయి "ఎవరు నువ్వు? అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లవాడు "అదే నాకు తెలీడం లేదు. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది" అని అంటాడు.
దివ్యదృష్టితో బాలుని వృత్తాంతం
ఆ బాలుని మాటలకు నారదుడు తన దివ్యదృష్టితో చూసి ఆశ్చర్యపోయి ఈ బాలుడు సామాన్యుడు కాదని, గొప్ప దాత మహర్షి దధీచి కొడుకు అని గ్రహించి బాలునితో తన తండ్రి వృత్తాంతాన్ని వివరించాడు.
తండ్రి మరణం గురించి తెలుసుకున్న బాలుడు
నారదుని ద్వారా తన తన తండ్రి దధీచి మహర్షి వృత్తాంతాన్ని తెలుసుకున్న ఆ బాలుడు తన తండ్రి 31 ఏళ్లకే ఎందుకు చనిపోయాడని నారదుని ప్రశ్నిస్తాడు. అప్పుడు నారదుడు దధీచి మహర్షికి శనిదేవుని మహాదశ ఉన్నందున అకాల మరణం సంభవించిందని తెలిపాడు. అప్పుడు ఆ బాలుడు ప్రస్తుతం తన దురదృష్టానికి కారణమేమిటని అడుగగా అందుకు కూడా శనిదేవుని మహాదశయే అని నారదుడు చెబుతాడు.
బాలునికి నామకరణం
నారదుడు బాలునికి అన్ని విషయాలు చెప్పి రావి చెట్టు ఆకులు, పండ్లు తిని జీవించాడు కాబట్టి అతనికి పిప్పలాదుడు అని పేరు పెట్టాడు. సంస్కృతంలో రావి చెట్టును పిప్పల వృక్షం అంటారు. నారదుడు పిప్పలాదునికి దీక్ష ఇచ్చి, తపస్సు చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
పిప్పలాదుని కఠోర తపస్సు
ఆ తరువాత పిప్పలాదుడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మాదేవుడు పిప్పలాదుని వరం కోరుకోమని అడుగగా, దేనినైనా దహించే శక్తిని తన కళ్ళకు ఇవ్వమని వరం కోరుకుంటాడు. బ్రహ్మ తధాస్తు అంటాడు. ఇక ఆనాటి నుంచి పిప్పలాదుడు తన కంటిచూపుతో అన్నింటినీ కాల్చివేయడం ప్రారంభించాడు. తన తండ్రి మరణానికి, తన దుస్థితికి కారణమైన శని దేవుని కూడా అలాగే చూడగా శరీరం కూడా దహించుకుపోసాగింది. విశ్వంలో కలకలం రేగింది. సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు.
బ్రహ్మను ఆశ్రయించిన సూర్యుడు
తన కళ్ల ముందు కాలిపోతున్న కొడుకుని చూసి సూర్యుడు రక్షించమని బ్రహ్మదేవుడిని వేడుకున్నాడు. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై శనిదేవుడిని విడిచి పెట్టమని అడుగగా, అందుకు పిప్పలాదుడు ఒప్పుకోడు. అప్పుడు బ్రహ్మదేవుడు పిప్పలాదునికి శని దేవుని విడిచి పెడితే రెండు వరాలను ఇస్తానని చెబుతాడు.
రెండు వరాలు కోరుకున్న పిప్పలాదుడు
బ్రహ్మ మాటలకు పిప్పలాదుడు సంతోషించి రెండు వరాలు అడిగాడు. మొదటి వరంగా పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదని, తద్వారా తనలా మరెవ్వరూ అనాథ కాకూడదని కోరుకున్నాడు.
రెండో వరంగా అనాథ అయిన తనకు ఆశ్రయమిచ్చిన రావి చెట్టుకు సూర్యోదయానికి ముందు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదని రెండవ వరం కోరుకున్నాడు.
మందగమనుడిగా శని
బ్రహ్మ దేవుడు 'తథాస్తు' అని రెండు వరాలు అనుగ్రహించగా అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు. శనిదేవుని పాదాలు అగ్ని వేడిమికి దెబ్బతినడం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు. అందుకే శనికి మందగమనుడు అంటే మెల్లగా నడిచే వాడని పేరు వచ్చింది. అగ్ని కారణంగా నల్లగా మారిన శనికి నల్లని వస్త్రాలు సమర్పించడం ద్వారా ప్రీతి చెందుతాడు. ఏలినాటి శని దశ నడుస్తున్నప్పుడు శనికి ఆశ్రయమిచ్చిన రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశం ఇదే.
ఈ పిప్పలాదుని చరిత్రను ప్రతి శనివారం చదువుకోవడం వలన శని దోషాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.