CSK vs RCB IPL 2024:2024 ఐపీఎల్లో తొలి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌తో సీజన్ 17కు తెర లేవనుంది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్కే కొత్త శకాన్ని ప్రారంభించనుంది. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ జట్టును ముందుకు నడిపిస్తాడన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గాయం కారణంగా న్యూజిలాండ్ బ్యాటర్ డేవన్ కాన్వే టోర్నీకి దూరం కాగా, అతడి స్థానంలో యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్ ప్రారంభించే ఛాన్స్ ఉంది. అయితే బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉన్నప్పటికీ భారీ మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేసిన సమీర్ రజ్వీని కూడా బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బౌలింగ్‌లోనూ మొయిన్ అలీ జడేజా రూపంలో స్పిన్ ఆల్ రౌండర్లు ఉన్నారు. శార్దూల్ ఠాకూర్ రెండేళ్ల తర్వాత సీఎస్కేకు ఆడుతున్నాడు. దీపక్ చాహర్ కూడా బ్యాటింగ్ చేసే పేస్ బౌలర్లు. ఈ మ్యాచ్‌కు పతిరణ దూరమవ్వడం వల్ల తుషార్ పాండేతో కలిసి సీనియర్లు ఇద్దరూ పేస్ దళాన్ని నడిపించాల్సి ఉంటుంది.
అయితే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే కొన్ని మ్యాచులకు ధోనీ పూర్తిస్థాయిలో ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే సీఎస్కేకు ప్రస్తుతం ఉన్న ఏకైక సీనియర్ వికెట్ కీపర్ ధోనీనే. గాయం కారణంగా కాన్వే కొన్ని మ్యాచులకు అందుబాటులో ఉండటం లేదు. యువ వికెట్ కీపర్ ఆరవిల్లేను గత మినీ వేలంలో ఎంపిక చేసింది సీఎస్కే. ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ మాత్రమే చేసి వికెట్ కీపింగ్ యంగ్ ప్లేయర్లకు అప్పగించే ఛాన్స్ కూడా లేకపోలేదు. యువ టాలెంట్ ను ప్రోత్సహించడంలో ధోని ఎప్పుడూ ముందుంటాడు.
మరోవైపు ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని ఆర్సీబీకి చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ సవాల్‌గా మారనుంది. ఇక కోహ్లీ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. కోహ్లి- డుప్లెసిస్ జోడీ ఏ జట్టుపైనా సరే దూకుడుగా రాణిస్తారు. కానీ, సీఎస్కేపై ఆర్సీబీ రికార్డు అంత బాగా లేదు. ఐపీఎల్ 2020 సీజన్ నుండి సీఎస్కేతో జరిగిన గత ఏడు మ్యాచ్‌లలో ఆర్సీబీ ఐదుసార్లు ఓడిపోయింది. అదే సమయంలో, గత ఆరు మ్యాచ్‌లలో ఐదు ఓటమిని చవిచూశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీ తన జోరును ఏమాత్రం తగ్గించుకుండా మొదటి మ్యాచ్‌లో విజయంతో సీజన్‌ను ప్రారంభించాలని ప్రయత్నిస్తుంది. సీఎస్కే మెరుగైన బౌలింగ్ కలిగి ఉన్నప్పటికీ, రెండు జట్ల మధ్య గట్టి పోటీనే ఉండబోతుంది