Dhoni IPL 2025 Update :ఐపీఎల్ సీజన్ 2025 కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే ఎప్పటిలాగే టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, సీఎస్కే ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడతాడా? లేదా అని అందరిలోనూ సందేహం ఉంది. తాజాగా ఈ విషయంపై స్పందించారు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్. ఆయన ఏమన్నారంటే?
వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోనీ ఆడుతాడో? లేదో? ఇంకా చెప్పలేదని కాశీ విశ్వనాథన్ తెలిపారు. అక్టోబరు 31లోగా ధోనీ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడని పేర్కొన్నారు. అయితే ఐపీఎల్ 2025లో సీఎస్కే తరఫున ఆడుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్లో ధోనీ ఆడతాడా? లేదా? కేవలం మెంటార్‌గా ఉంటాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాశీనాథన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
'ధోనీ ఆడాలని కోరుకుంటున్నాం' -"అక్టోబరు 31లోపు తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ధోనీ చెప్పాడు. ఈ తేదీ అన్ని జట్లు తమ రిటెన్షన్ జాబితాను నిర్ధారించడానికి గడువు. ఐపీఎల్ 2025లో సీఎస్కే తరఫున ధోనీ ఆడాలని మేము కోరుకుంటున్నాము. కానీ ధోని ఇంకా మాకు ఆ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. మహీ సీఎక్కే తరఫున ఆడుతాడని ఆశిస్తున్నాం." అని కాశీ విశ్వనాథన్ వ్యాఖ్యానించాడు.
ధోనీ కోసమే అన్ క్యాప్డ్ ప్లేయర్ రూల్! -సీఎస్కే ఆటగాడు ఎంఎస్ ధోనీ కోసమే అన్ క్యాప్డ్ ప్లేయర్ రూల్‌ను బీసీసీఐ తీసుకొచ్చిందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ రూల్ ప్రకారం ధోనీని రూ.4 కోట్లు పెట్టి సీఎస్కే రిటైన్ చేసుకోవచ్చు. అయితే కెప్టెన్ కూల్ వచ్చే సీజన్లో ఆడుతాడా? లేదా? అనే అనుమానం చాలా మందిలో కలుగుతోంది. ఈ విషయంపై ధోనీ క్లారిటీ ఇవ్వాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
కెప్టెన్‌గా అదుర్స్ -సీఎస్కేకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ ఆ జట్టును విజయపథంలో నడిపించాడు. ఐదు సార్లు ట్రోఫీలను అందించాడు. అలాగే ప్లేయర్ గానూ అదరగొట్టాడు. అందుకు ధోనీని వదులుకునేందుకు సీఎస్కే ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. ఇకపోతే 264 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 5243 పరుగులు చేశాడు మహీ. అందులో 24 అర్ధ శతకాలు ఉన్నాయి. అలాగే భారత్ తరఫున 90 టెస్టుల్లో 4876 రన్స్, 350 వన్డేల్లో 10773 పరుగులు చేశాడు. 98 టీ20ల్లో 1617 పరుగులు బాదాడు. అలాగే భారత్‌కు ఐసీసీ టీ20, వన్డే వరల్డ్ కప్‌ను అందించాడు ధోనీ.
ఐపీఎల్ 2025లో ధోనీ ఆడటంపై CSK సీఈఓ కామెంట్స్ - ఆ రోజులోగా మహీ నిర్ణయం వెల్లడి - IPL 2025 MS DHONI CSK CEO
వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోనీ ఆడడంపై సీఎస్కే సీఈఓ హింట్ - ఆ రోజులోగా నిర్ణయం వెల్లడిస్తాడని వ్యాఖ్యలు!
Dhoni IPL 2025 (source IANS)
Published : Oct 21, 2024, 12:13 PM IST