Costly Players Flop In Ipl :ఐపీఎల్ టోర్నమెంట్లో టైటిల్ లక్ష్యంగా ఆయా ఫ్రాంచైజీలు పలు ప్లేయర్లపై భారీ మొత్తం వెచ్చిస్తుంటాయి. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలోనూ ఆయా ఆటగాళ్లు భారీ ధరకు అమ్ముడయ్యారు. అయితే వేలంలో భారీ ధర దక్కించుకొని ఎన్నో అంచనాలతో బరిలోకి దిగుతున్న పలువురు ప్లేయర్లు ప్రతి ఏడాదీ నిరాశపరుస్తున్నారు. ఐపీఎల్ హిస్టరీలో అలా భారీ ధరకు అమ్ముడై అంచనాలు అందుకోకుండా పేలవ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లెవరో ఇప్పుడు చూద్దాం.
- 2024 ఐపీఎల్: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర దక్కించుకున్నాడు. సీజన్ 17కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో స్టార్క్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కానీ, వాస్తవంలో మాత్రం స్టార్క్ ప్రదర్శన ఊహించిన స్థాయిలో లేదు. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ 2 మ్యాచ్‌లు ఆడిన స్టార్క్, ఒక్క వికెట్ పడగొట్టకపోగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో స్టార్క్ ఏకంగా 100+ పరుగులు ఇచ్చుకోవడం గమనార్హం.
- 2023 ఐపీఎల్: గతేడాది ఐపీఎల్లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ శామ్ కరన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధరకు అమ్మడయ్యారు. శామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18.5కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ఏడాది వరకూ ఇదే అత్యధిక ధర. మరోవైపు గ్రీన్‌ను రూ. 17.5కోట్లకు ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది. అయితే వీళ్లిద్దరూ అంచనాలు అందుకోవడంలో విఫలం అయ్యారు. కరన్ 14 మ్యాచ్‌లాడి 276 పరుగులకే పరిమితం కాగా, బౌలింగ్‌లో 10 వికెట్లే పడగొట్టాడు. ఇక గ్రీన్ విషయానికొస్తే, 16 మ్యాచ్‌ల్లో 452 పరుగులు చేసి ఫర్వాలేదనిపించినా, బంతితో ఆకట్టుకోలేదు. అతడు బౌలింగ్‌లో 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
- 2022 ఐపీఎల్: 2022లో ముంబయి యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కోసం రూ.15.25కోట్లు వెచ్చించింది. అయితే ఆ సీజన్లో ఇషాన్ 14 మ్యాచ్‌ల్లో 418 పరుగులు చేశాడు. సీజన్ ప్రారంభంలో ఒకట్రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా సెకండ్ హాఫ్‌లో నిరాశపరిచాడు.
- 2021 ఐపీఎల్:2021లో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ అత్యధిక ధర దక్కించుకున్నాడు. అతడి కోసం రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ.16.25 కోట్లు పెట్టింది. అయితే మోరిస్‌కు ఆ ధర చాలా ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు తగ్గట్లే అతడి ప్రదర్శన చేశాడు. ఆల్‌రౌండర్ పాత్రలో అతడు 15 వికెట్లతో పర్వాలేదనిపించినా, బ్యాటింగ్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. మోరిస్ ఆ సీజన్లో కేవలం 67 పరుగులే చేశాడు.