India vs Pakistan 2009 Champions Trophy : ఐసీసీ టోర్నీ మొదలైతే అందరం ఇండియానే కప్పు గెలవాలని కోరుకుంటాం. అందులోనూ పాకిస్థాన్‌ని ఫైనల్లో ఓడించి టైటిల్ గెలిస్తే ఆ కిక్కే వేరని ఫీల్ అవుతాం. అలాంటిది ఓసారి మాత్రం టీమ్‌ఇండియా ఫ్యాన్స్ అంతా పాకిస్థాన్ మ్యాచ్ గెలవాలని కోరుకున్నారు. ఏంటి షాక్ అయ్యారా? అలా ఎప్పుడు, ఎందుకు జరిగిందో ఇప్పుడు చూద్దాం.
2009 సెప్టెంబర్ 30, ఛాంపియన్స్ ట్రోఫీలో కీలకమైన రోజు. టోర్నమెంట్ చివరి గ్రూప్ దశకు చేరుకుంది. సెమీఫైనల్స్‌లో స్థానం కోసం కొన్ని జట్లు పోరాడుతున్నాయి. ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు, ప్రతి గ్రూప్‌లో టాప్ టూలో ఉన్నవి సెమీస్ ఆడుతాయి. ఆ రోజు రెండు మ్యాచ్‌లు ఇండియా వర్సెస్ వెస్టిండీస్, ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ జరుగుతున్నాయి.
మామూలుగా అయితే మన ఫోకస్ అంతా ఇండియా మ్యాచ్‌పైనే ఉండాలి. కానీ అందరి దృష్టి ఆస్ట్రేలియా-పాకిస్థాన్ గేమ్‌పైనే ఉంది. కారణం ఏంటంటే? ఇండియా సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ గెలవాల్సిన అవసరం ఉంది. దీంతో భారత అభిమానులు అందరూ పాక్ గెలవాలని కోరుకున్నారు.
ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది?
ఆస్ట్రేలియా అప్పటికే వెస్టిండీస్‌ను ఓడించింది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో రెండు టీమ్‌లకు ఒక్కో పాయింట్ లభించింది. మరోవైపు పాకిస్థాన్ అప్పటికే భారత్, వెస్టిండీస్ రెండింటినీ ఓడించి సెమీఫైనల్స్‌కు చేరుకుంది.
వెస్టిండీస్‌ను ఓడించిన భారత్, మూడు మ్యాచ్‌ల అనంతరం కేవలం మూడు పాయింట్లతో నిలిచింది. పాకిస్థాన్ రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో ఉంది. ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌లు ఆడి మూడు పాయింట్లు సాధించింది. అంటే పాకిస్థాన్‌పై గెలిస్తే సెమీస్‌కి చేరుతుంది. దీంతో భారత్ అర్హత సాధించాలంటే పాకిస్థాన్ గెలవాలి.