Champions Trophy 2025 Teamindia Tour To Pakisthan : పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనుంది. అయితే ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్తుందా లేదా అనే విషయంపై చాలా కాలం నుంచి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై మరోసారి ఓ పీసీబీ అధికారి మాట్లాడారు.
భద్రతా, రవాణాపరమైన కారణాల దృష్ట్యా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియాను పంపించడానికి భారత ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోతే, ఆ విషయాన్ని రాతపూర్వకంగా తెలపాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరినట్లు సదరు అధికారి తెలిపారు. టోర్నీకి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ విషయంపై వీలైనంత త్వరగా ఓ నిర్ణయానికి రావాలని, దాన్ని తెలియజేయాలని పాక్ బోర్డు విజ్ఞప్తి చేసినట్లు అన్నారు.
"భారత ప్రభుత్వం అనుమతిని నిరాకరిస్తే, బీసీసీఐ దాన్ని రాతపూర్వకంగా లేఖను ఐసీసీకి సమర్పించాలి. కనీసం 5-6 నెలల ముందే పాకిస్థాన్ పర్యటన విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఐసీసీకి తెలియజేయాలి." అని ఓ పీసీసీ అధికారి తెలిపారు.