Melbourne Test Attendance 2024 :మెల్బోర్న్ వేదికగా భారత్- ఆసీస్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు రికార్డు సృష్టించింది. రసవత్తరంగా సాగుతున్న ఈ నాలుగో టెస్టుకు ప్రేక్షకులు స్టేడియానికి పోటెత్తారు. 5 రోజుల్లో ఈ టెస్టుకు మొత్తం 3,51,104 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ క్రమంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌కు అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన టెస్టు మ్యాచ్‌గా ఈ బాక్సింగ్ డే టెస్టు రికార్డు సృష్టించింది.
88 ఏళ్ల రికార్డు బ్రేక్
ఆసీస్ క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్ మాన్ గతంలో ఆడుతున్నప్పుడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు. 1936- 37 యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన టెస్టుకు 6 రోజుల్లో 3,50,534 మంది హాజరయ్యారు. తాజాగా ఆసీస్- భారత్ మధ్య జరుగుతున్న టెస్టు 3,51,104 మంది ప్రేక్షకులతో 88ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఓవరాల్‌గా ఇది రెండో అత్యధికం. 1989-99 భారత్- పాకిస్థాన్ మధ్య టెస్టులో 4,65,000 మంది హాజరయ్యారు. ఒక టెస్టు మ్యాచ్‌కు అత్యధికంగా ప్రేక్షకుల హాజరైన మ్యాచ్ ఇదే.
భారీగా ప్రేక్షకులు
కాగా, డిసెంబరు 26న ఆసీస్- భారత్ మధ్య మెల్ బోర్న్ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభమైంది. తొలి రోజు నుంచి వేడిని సైతం లెక్కచేయకుండా ప్రేక్షకులు మ్యాచ్ చూసేందుకు భారీగా హాజరయ్యారు. ఐదో రోజు వచ్చేసరికి మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకుల సంఖ్య 3,51,104కు చేరింది. అలాగే ఆస్ట్రేలియాలో ఇప్పటివరకు జరిగిన టెస్టుల్లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన మ్యాచ్ ఇదే అని క్రికెట్ ఆస్ట్రేలియా ధ్రువీకరించింది.
'ఇది ఊహించలేదు'
ఈ టెస్టుకు ఇంత భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని MCG, క్రికెట్ ఆస్ట్రేలియా ఊహిందలేదని ఆసీస్ జర్నలిస్టు టామ్ మోరిసన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రేక్షకులందరికి ఆహారం, పానీయాలను అందించేందుకు గ్రౌండ్ స్టాఫ్ కృషి చేస్తోందని పేర్కొన్నారు.