తెలంగాణ

telangana

ETV Bharat / sports

బాక్సింగ్ డే టెస్ట్​ ఆస్ట్రేలియా స్క్వాడ్​ : సీనియర్ ఔట్​, కొత్త కుర్రాడికి చోటు! - BOXING DAY TEST AUSTRALIA SQUAD

భారత్‌తో చివరి రెండు టెస్టులకు ఆసీస్‌ జట్టు ప్రకటన - జట్టులోకి 19 ఏళ్ల కుర్రాడు

Boxing Day Test Australia Squad
Boxing Day Test Australia Squad (Getty Images)

By ETV Bharat Sports Team

Published : 12 hours ago

Boxing Day Test Australia Squad : బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే మూడు టెస్ట్​లు విజయవంతంగా జరగ్గా, రానున్న రెండు టెస్టుల కోసం ఆస్ట్రేలియా జట్టును తాజాగా ప్రకటించింది ఆ జట్టు క్రికెట్ బోర్డు. అయితే 15 మంది ఆటగాళ్లతో ఓపెనర్ నాథన్ మెక్‌స్వినీపై వేటు వేసి అతడి స్థానంలో 19 ఏళ్ల సామ్‌ కొన్‌స్టాస్‌ను జట్టులోకి తీసుకుంది ఆసీస్​. దీంతో మిగతా రెండు మ్యాచ్​లకు ఉస్మాన్‌ ఖవాజాతో కలిసి కొన్‌స్టాస్‌ ఓపెనింగ్​కు దిగే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకుల మాట. దీంతో పాటు పేసర్‌ జే రిచర్డ్‌సన్‌ను మూడేళ్ల తర్వాత తిరిగి జట్టుకు ఎంపిక చేసింది ఆస్ట్రేలియా. రిచర్డ్‌సన్‌తోపాటు మరో పేసర్ సీన్ అబాట్ కూడా ఈ సారి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఇంతకీ ఎవరు ఈ సామ్‌ కొన్‌స్టాస్‌?
టీనేజర్‌ అయిన సామ్‌ కొన్‌స్టాస్‌ టాపార్డర్‌లో బరిలోకి దిగి దూకుడుగా ఆడతాడు. తాజాగా ప్రారంభమైన బిగ్ బాష్‌ లీగ్‌లో సిడ్నీ థండర్ తరఫున అరంగేట్రం చేసిన ఈ కుర్రోడు అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే 27 బంతుల్లో 56 పరుగులు నమోదు చేశాడు. అందులో ఎనిమిది ఫోర్లు, 2 సిక్స్‌లు ఉండటం విశేషం. తన మెరుపు ఇన్నింగ్స్​తో సామ్​ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇక షెఫీల్డ్ షీల్డ్‌ టోర్నీలో న్యూ సౌత్ వేల్స్ తరఫున ఆడి రెండు సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. బోర్డర్ - గావస్కర్ సిరీస్‌ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా-ఎ, భారత్ ఎ జట్ల మధ్య జరిగిన రెండు అనధికారిక టెస్టుల్లోనూ ఈ కుర్రాడు ఆడాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 92 పరుగులు స్కోర్ చేశాడు. రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో కేవలం 128 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. భారత్, ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌ మ్యాచ్‌లోనూ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా వచ్చి (107) శతకం బాదాడు.

ఇదిలా ఉండగా, బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించగా, అడిలైడ్‌లో ఆసీస్ గెలిచింది. అయితే బ్రిస్బేన్‌లో మాత్రం మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో డిసెంబరు 26-30 మధ్య నాలుగో టెస్టు మెల్‌బోర్న్‌లో, అలాగే జనవరి 3-7 మధ్య సిడ్నీలో ఐదో టెస్టు జరగనున్నాయి.

భారత్‌తో చివరి రెండు టెస్టులకు ఆసీస్‌ తుది జట్టు ఇదే
పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, సీన్ అబాట్, బ్యూ వెబ్‌స్టర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కెరీ, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా,సామ్‌ కొన్‌స్టాస్‌, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, రిచర్డ్‌సన్, మిచెల్ స్టార్క్.

'రెండేళ్లుగా నాకు క్రికెట్ గురించి ఎటువంటి జ్ఞాపకాలు లేవు - అందుకే ఈ రిటైర్మెంట్ అంత బాధగా అనిపించట్లేదు!'

గబ్బాలో గట్టెక్కాం- మరి భారత్ WTC ఫైనల్ సంగతేంటి?

ABOUT THE AUTHOR

...view details