Border Gavaskar Trophy 2024 Team India Squad : బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా మరో రెండు రోజుల్లో ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్టు ఆడనుంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రా జట్టును ముందుండి నడిపించనున్నాడు. తుది జట్టు ఎంపికపై తనదైన ప్రభావం చూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పేస్‌కు అత్యంత అనుకూలంగా ఉండే పిచ్ పెర్త్. ఇటువంటి దానిపై కనీసం నలుగురు పేసర్లు ఉండాలని ఏ కెప్టెనైనా కోరుకుంటాడు. ఒక్క స్పిన్నర్‌ను బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు స్క్వాడ్‌లో ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లు, ఒక పేస్ ఆల్‌రౌండర్ ఉన్నాడు. మరి ఎవరికి అవకాశం వస్తుందన్న విషయం సస్పెన్స్‌గా మారింది. అయితే, బుమ్రా మాత్రం తన తుది జట్టుపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేసినట్లు సమాచారం.
జడ్డూ, సుందర్ ఇక అంతే!
సాధారణంగా విదేశాల్లో స్పిన్నర్‌ను తీసుకోవాలంటే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపేది. కానీ, ఈ సారి ఆసీస్‌పై అద్భుతమైన రికార్డు కలిగిన రవిచంద్రన్ అశ్విన్‌ను ఏకైక స్పిన్నర్‌గా ఈ తుది జట్టులోకి తీసుకోవాలనే ఉద్దేశంలో బుమ్రా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్‌కు ఈ సారి ఛాన్స్ దక్కన్నట్లే తెలుస్తోంది. ఇక బౌన్సీ పిచ్‌లపై అశ్విన్ మరింత ప్రమాదకరంగా మారతాడనే అంచనాతోనే బుమ్రా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
నితీశ్ డెబ్యూ మ్యాచ్ - మిడిలార్డర్‌లో సర్ఫరాజ్!
ఇక ఈ ట్రోఫీతోతెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. పేస్ ఆల్‌రౌండర్‌గా అతడికి స్థానం దక్కనున్నట్లు క్రికెట్ వర్గాల మాట. ఇటీవలె జరిగిన ఆస్ట్రేలియా Aతోపాటు ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌లో నితీశ్ మెరుగైన పెర్ఫామెన్స్‌ను మేనేజ్‌మెంట్ గమనించింది. ఈ నేపథ్యంలో అతడికి ఈ మ్యాచుల్లో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే సత్తా కలిగి ఉండటం నితీశ్‌కు కలిసొచ్చే అంశమని వారి అభిప్రాయం. హర్షిత్ రాణా, యశ్ దయాళ్‌కు ఇప్పుడే ఛాన్స్ రాకపోవచ్చు. పేస్ భారాన్ని కెప్టెన్ బుమ్రాతోపాటు ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్ పంచుకోనున్నారు. లోతైన బ్యాటింగ్‌తో పాటు ఫాస్ట్ బౌలింగ్ బలంగా ఉండేలా మేనేజ్‌మెంట్ చూస్తోంది.