TestCricket Players Domestic Cricket : భారత క్రికెట్ హెడ్ కోచ్‌గా గంభీర్ ఇటీవలే ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నెల చివర్లో లంకతో టీమ్ఇండియా ఆడబోయే టీ20, వన్డే సిరీస్‌లతో గంభీర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే దీనికి మరో 15 రోజులు సమయం ఉండగానే గంభీర్ తన మార్క్ కోచింగ్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే టెస్ట్ క్రికెట్ ఆడే ప్లేయర్లకు బీసీసీఐ సరికొత్త కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.
తాజాగా బోర్డు భారత జట్టు టెస్టు స్పెషలిస్టులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్ట్‌లో జరగబోయే దులీప్ ట్రోఫీకి టెస్టు టీమ్ రెగ్యులర్ ప్లేయర్స్ అందుబాటులో ఉండాలని పేర్కొంది. ప్రతి ప్లేయర్ కనీసం ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించింది.
సెప్టెంబరులో స్వదేశంలో మొదలుకానున్న టెస్టు సీజన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందట. కాగా, సెప్టెంబర్‌లో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో భారత టెస్ట్ సీజన్ మొదలుకానుంది. అనంతరం స్వదేశంలోనే న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగగా, నవంబర్ 22 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకు టీమ్ఇండియా ఆస్ట్రేలియా పర్యటనుకు వెళ్లి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది.