Team India Head Coach BCCI :ఇండియన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ నుంచి ప్రకటన వెలువడినప్పటి నుంచి రాహుల్ ద్రవిడ్ వారసులుగా కొందరి పేర్లు వినిపించాయి. అయితే దరఖాస్తు చేసుకోవడానికి గడువు సమీపిస్తున్న తరుణంలో స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను హెడ్ కోచ్‌కి అప్లై చేసుకునేలా ఒప్పించాలని దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీనీ బీసీసీఐ కోరినట్లు సమాచారం.
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫ్లెమింగ్ కొనసాగుతున్నాడు. ఎక్కువ కాలం సీఎస్కే హెడ్ కోచ్‌గా కూడా పని చేశాడు. అతని హయాంలోనే చెన్నై ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. ఈ కాలంలో అతనికి ధోనీతో సన్నిహిత సంబంధం ఏర్పడింది.
అయితే ఫ్లెమింగ్ టీమ్ ఇండియా హెడ్ కోచ్ అయితే బావుంటుందని బీసీసీఐ భావిస్తోందట. అందుకే హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేలా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ఫ్లెమింగ్‌ను ధోనీ ఒప్పించగలడని అనుకుంటోంది. ఫ్లెమింగ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేర్వేరు T20 టీమ్‌లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అంత బిజీగా ఉంటూ కూడా, తన ఫ్యామిలీకి క్వాలిటీ టైమ్ కేటాయిస్తున్నాడు. ఇలాంటి సమయంలో 2027 వరకు టీమ్ ఇండియాకు కమిట్ అవ్వడానికి అతను కాస్త సంకోచించినట్లు సమాచారం.