IPL 2025 Auction Rules :2025 ఐపీఎల్ వేలానికి సంబంధించి రూల్స్ ఎలా ఉండనున్నాయని క్రికెట్ ఫ్యాన్స్‌లో రోజురోజుకు ఆసక్తి పెరిగిపోతోంది. ఈ మెగా వేలంగా రిటెన్షన్ పాలసీ ఎలా ఉండనుందోనని ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయమై బీసీసీఐ ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీల సలహాలు, అభిప్రాయాలు సేకరించింది. తాజాగా బెంగళూరులో జరిగిన బీసీసీఐ జనరల్ మీటింగ్‌లో 2025 ఐపీఎల్ వేలానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు వేలం నిబంధనలు ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.
కొత్త రిటెన్షన్ పాలసీ విధానంలో రైట్ టు మ్యాచ్ కార్డ్ (Right To Match Card) విధానాన్ని బీసీసీఐ తిరస్కరించినట్లు తెలిసింది. అన్ని ఫ్రాంచైజీలు గరిష్ఠంగా ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. అందులో ముగ్గురు దేశీయ, ఇద్దరు విదేశీ ప్లేయర్లు ఉండవచ్చు. ఈ మేరకు బీసీసీఐ కొత్త రిటెన్షన్ పాలసీని త్వరలోనే అధికారికంగా వెల్లడించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే మెగా వేలానికి ముందు ప్లేయర్ల రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ కార్డ్ విధానంపై ఒక్కో ఫ్రాంచైజీ ఒక్కోలా బీసీసీఐకి సుచనలు చేశాయి. పలు ఫ్రాంచైజీలు ఎనిమిది మంది ప్లేయర్లను లేదా 2 రైట్ టు మ్యాచ్ కార్డ్ అప్షన్లు ఇవ్వాల్సిందిగా బీసీసీఐని కోరినట్లు తెలిసింది. కానీ, అవేవీ లేకుండా కేవలం ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకునే అవకాశం కల్పించాలని బీసీసీఐ తాజా సమావేశంలో నిర్ణయించినట్లు క్రీడావర్గాల సమాచారం.