BCCI Next Secretary :ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ ఛైర్మన్ పదవికి కోసం పోటీ చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్ క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. అయితే మరోసారి ఆయన ఎన్నికల బరిలో నిలిచేందుకు నిరాసక్తి వ్యక్తం చేశాడు. దీంతో బీసీసీఐ సెక్రట్రీ జై షా నిలుస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. షా ఎన్నికల బరిలో నిలిస్తే ఐసీసీ నూతన ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
అయితే జై షా ఐసీసీ ఛైర్మన్ పదవి చేపడితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవితోపాటు, బీసీసీఐ సెక్రటరీ పదవుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. దీంతో జై షా స్థానంలో ఎవరు నియమితులవుతారనే దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బీజేపీ నేత, కేంద్ర మాజీమంత్రి తనయుడు పేరు బాగా వినిపిస్తోంది. తనే తదుపరి కార్యదర్శిగా నియమితులవుతారని ప్రచారం జరుగుతోంది. ఆయనే దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు, దిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడు రోహన్ జైట్లీ. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శి రేసులో ముందున్నట్లు సమాచారం.
ఐసీసీ ఛైర్మన్ జై షా!
ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ ఛైర్మన్‌గా నియమితులైతే అతడి స్థానంలోకి రోహన్ వచ్చే అవకాశం ఉందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. జై షాకు ఐసీసీ బోర్డులోని 16 మంది సభ్యుల్లో 15 మంది సపోర్ట్ ఉన్నట్లు తెలిస్తోంది. విజేతకు తొమ్మిది ఓట్ల సాధారణ మెజారిటీ (51%) అవసరం. అందుకే జై షా ఎంపిక దాదాపు ఖాయమని సమాచారం.
రోహన్‌కు సపోర్ట్
బోర్డు సెక్రటరీ రేసులో రోహన్ జైట్లీ పేరు ముందుంది. రోహన్ ఎంపికకు అందరూ ఏకీభవించారు. అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఇతర ఆఫీస్ బేరర్లు పదవీ కాలం ఏడాది తర్వాత ముగుస్తున్నందున వారి వారి స్థానాల్లో కొనసాగుతారు.