Jay Shah on Teamindia HeadCoach : టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా ఫారిన్ కోచ్‌ను ఎంపిక చేసుకునేందుకు బోర్డు మొగ్గు చూపుతోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్, దిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ తనను సంప్రదించిందని, కానీ తాను రిజెక్ట్ చేసినట్లు అన్నాడు. ఫ్లెమింగ్ కూడా దాదాపుగా ఇలానే అన్నాడు. తాజాగా ఈ వ్యాఖ్యలపై బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించాడు. తాను కానీ, బీసీసీఐ కానీ ఏ మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ను సంప్రదించలేదని పేర్కొన్నాడు.
"కోచ్ పదవి ఆఫర్ చేసేందుకు నేను కానీ బీసీసీఐ గానీ ఏ ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ను సంప్రదించలేదు. మీడియాలో వస్తోన్న వార్తలు అవాస్తవం. జాతీయ జట్టుకు సరైన కోచ్‌ను వెతకడం అనేది కచ్చితమైన, సమగ్రమైన ప్రక్రియ. భారత క్రికెట్ నిర్మాణంపై లోతైన అవగాహన ఉన్న వారి కోసం, అలాగే ర్యాంకుల ద్వారా అంటే అంచెలంచెలుగా ఎదిగిన వారిపై దృష్టి సారించాం. టీమ్ఇండియాను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి మన కోచ్‌కు దేశవాళీ క్రికెట్‌పై లోతైన పరిజ్ఞానం ఉండటం ఎంతో కీలకం ఇంటర్నేషనల్ క్రికెట్లో భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ కన్నా మరో ప్రతిష్టాత్మకమైన రోల్ లేదు. ప్రపంచవ్యాప్తంగా టీమ్ఇండియాకు అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. వారి నుంచి భారీ మద్దతును జట్టు పొందుతోంది. మన గొప్ప చరిత్ర, ఆటపై ఉన్న మక్కువ వల్ల ఈ హెడ్ కోచ్ పాత్ర ప్రపంచంలోని అత్యంత గొప్ప ఉద్యోగాలలో ఒకటిగా మారింది" అని జైషా అన్నారు.