Champions Trophy PCB BCCI : పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తే, భవిష్యత్‌లో భారత్‌లో నిర్వహించాల్సిన ఐసీసీ ఈవెంట్లను కూడా అదే మోడల్‌లో నిర్వహించాలని పాక్ మెలిక పెట్టింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ గట్టి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పీసీబీకి భారత్ స్ట్రాంగ్ కౌంటర్! -దాయాది దేశం పాకిస్థాన్‌లో భద్రతా కారణాల రీత్యా తాము అక్కడ పర్యటించేది లేదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే భారత్ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌పై పీసీబీ షరతు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిని బీసీసీఐ తిరస్కరించింది. భారత్‌లో ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు లేవని, ఇక్కడ నిర్వహించే ఐసీసీ ఈవెంట్లకు హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించే ప్రశ్నే లేదని బీసీసీఐ తేల్చిచెప్పినట్లు కథనాలు వచ్చాయి. ఈ మేరకు ఐసీసీకి బీసీసీఐ స్పష్టం కూడా చేసింది.
అందుకే పాక్ మెలిక
వచ్చే ఏడాది జరగబోయే మహిళల వన్డే ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2026లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా టీ20 ప్రపంచకప్ నిర్వహించనుంది భారత్. అలాగే 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే ప్రపంచకప్ భారత్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది.
లేదంటే వేదిక మార్పు పక్కా!
వచ్చే ఏడాది జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై పీసీబీ తన మొండి వైఖరిని అలాగే కొనసాగిస్తే ఆతిథ్య హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది. పాక్ దారికి రాకుంటే, ఇతర దేశాలకు ఈ టోర్నీని ఐసీసీ తరలించే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ పాక్ ఆతిథ్య హక్కులను కోల్పోతే ఆర్థికంగా భారీగా నష్టపోతుంది.
మరోవైపు, గత కొన్ని రోజులుగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పాకిస్థాన్‌లో తీవ్రంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ వేదికగా జరుగుతోన్న సిరీస్ నుంచి లంక జట్టు మధ్యలోనే నిష్క్రమించింది. రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడటం కోసం లంక-ఎ జట్టు పాకిస్థాన్‌కు వెళ్లింది. కానీ ఈ ఆందోళనల మధ్య రెండు వన్డేలు మిగిలి ఉండగానే, సిరీస్‌ను మధ్యలోనే వదిలేసి స్వదేశానికి వెళ్లిపోయింది. ఇలాంటి సందర్భాలు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాక్‌కు ఇబ్బందిగా మారాయి.
'పెళ్లైన తర్వాత బ్యాడ్మింటన్ కంటిన్యూ చేస్తాను - ఇప్పటికీ రోజూ ప్రాక్టీస్ చేస్తున్నా'
విరాట్ కోహ్లీకి గాయం? - ఆందోళనలో ఫ్యాన్స్!