Basit Ali On PCB Chief Mohsin Naqvi :పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB)పై ఆ దేశ మాజీ బ్యాటర్ బాసిత్ అలీ తీవ్ర ఆరోపణలు చేశాడు. పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చాలా పవర్ ఫుల్ అని, అతడికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పక్కన పెడతారని అన్నాడు. కోచ్‌గా చాలా అనుభవమున్న గ్యారీ కిరిస్టెన్ పాకిస్థాన్ కోచింగ్ పదవి నుంచి తప్పుకున్న సందర్భంగా అలీ స్పందించాడు. పీసీబీ ఛైర్మన్ నఖ్వీపై సంచలన ఆరోపణలు చేశాడు.
'మొహ్సిన్ నఖ్వీ స్ట్రాంగ్ సపోర్ట్‌తో పదవిలోకి వచ్చారు. కోచ్‌లు, సెలక్టర్లు, మేనేజర్‌లను తొలగిస్తున్నారు. ఇంతకు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్‌ని ఎప్పటికప్పుడు మార్చేవారు. ఇప్పుడు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా పక్కన పెడుతున్నారు. బాబర్ అజామ్‌ని తప్పించి మహ్మద్ రిజ్వాన్‌ను పాకిస్థాన్ కొత్త వైట్- బాల్ కెప్టెన్‌గా నియమించినప్పుడు సమస్య మొదలైంది. కిరిస్టన్ వేరే కెప్టెన్‌ని కోరుకున్నాడు. అలానే ఓ ఆటగాడు జట్టులో ఉండాలని డిమాండ్ చేశాడు. అతడు కోరుకున్న వారిద్దరూ జట్టులో లేరు. జట్టులో తనకు పూర్తి అధికారం ఉందని కిరిస్టెన్ భావించినట్లు ఉన్నాడు. కానీ, పాకిస్థాన్‌లో పీసీబీ చైర్మన్ కూడా రాత్రికి రాత్రే మార్చేస్తారని అతడికి తెలియదు' అని పేర్కొన్నాడు.
అక్టోబర్ 27 ఆదివారం లాహోర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మహ్మద్ రిజ్వాన్‌ను వన్డే, టీ20ఐ కెప్టెన్‌గా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆల్ రౌండర్ సల్మాన్ అలీ అఘాను కొత్త వైస్ కెప్టెన్‌గా నియమించారు.