Babar Azam Captain:పాకిస్థాన్ క్రికెట్ జట్టులో సంక్షోభం కొనసాగుతోంది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ నుంచి ప్రారంభమైన పాక్ క్రికెట్ సంక్షోభం ఇప్పటికీ ముగియలేదు. వన్డే ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శన తర్వాత అప్పటి కెప్టెన్ బాబర్ అజామ్‌పై పాక్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. వన్డే, టెస్టు, టీ 20 ఫార్మాట్లకు విడివిడిగా కెప్టెన్లను నియమించింది.అయినా పాక్ క్రికెట్ జట్టు ప్రదర్శన ఏ మాత్రం మెరుగుపడలేదు.
వరుస ఓటములతో పాక్ క్రికెట్ పాతాళానికి పడిపోతున్న క్రమంలో ఆ దేశ క్రికెట్ బోర్డు మరోసారి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టీ- 20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ పాక్ కెప్టెన్‌గా మళ్లీ బాబర్‌నే నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే కెప్టెన్సీ చేపట్టాలన్న పాక్ క్రికెట్ బోర్డు ప్రతిపాదనను బాబర్ ఆజమ్ నిరాకరించినట్లు సమాచారం. ఒకవేళ బాబర్ కెప్టెన్సీ వద్దనుకుంటే ఆ బాధ్యతలు బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు అప్పగించే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.
టార్గెట్ టీ-20 వరల్డ్‌కప్:2023 వన్డే వరల్డ్‌కప్ ఓటమి తర్వాత కెప్టెన్సీలో మార్పు చేసినప్పటికీ ఆయా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఘోర పరాజయాలు మూటగట్టుకుంది. 2023 ప్రపంచ కప్ తర్వాత షాన్ మసూద్ నేతృత్వంలోని పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల్లో ఆడింది. ఆస్ట్రేలియాతో ఆడిన మూడు టెస్టుల్లో, న్యూజిలాండ్‌లో జరిగిన టీ20 సిరీస్‌లో 1- 4 తేడాతో ఓడిపోయింది. దీంతో టీ20 వరల్డ్‌కప్ దగ్గపడుతున్న నేపథ్యంలో పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ బాబర్‌ను కెప్టెన్‌గా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.